* ఎక్కడ చూసినా డిజిటల్ మెరుపులు
* దేశీ, విదేశీ అతిథులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
తెలంగాణ రైజింగ్ – 2047 పేరుతో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌కు హైదరాబాద్ డిజిటల్ హంగులతో ముస్తాబైంది. రేపు, ఎల్లుండి జరగనున్న భారీ ఈవెంట్ కోసం సాంకేతికంగా అదిరిపోయే ఏర్పాట్లను చేశారు అధికారులు. దేశీ, విదేశీ అతిథులు శంషాబాద్ ఎయిర్ పోర్టు లో దిగి ఫ్యూచర్ సిటీ వేదికకు వచ్చే వరకు దారి పొడవునా స్వాగత ఏర్పాట్లు చేశారు. భారీ ఎల్ఈడీ తెరలు పెట్టారు. హైదరాబాద్ నలుమూలలా సమిట్ లోగోలతో 1,500 జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇందుకోసం హైదరాబాద్‌లోని పది ప్రదేశాల్లో ప్రత్యేక సమాచార స్టాళ్లను ఏర్పాటు చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా డిజిటల్ టన్నెల్
సమ్మిట్ జరగనున్న ఫ్యూచర్ సిటీలో డిజిటల్ తెరలతో నిర్మించిన టన్నెల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. త్రీడీ డిజైన్లతో 50 మీటర్ల టన్నెల నుంచి అథితులు సమ్మిట్‌కు చేరేలా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతాల్లో హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ ప్రదర్శనలు ఉంచారు. అతిథులకు తెలంగాణ సాంస్కృతిక వైభవం చాటేలా ఏర్పాట్లు చేశారు. సచివాలయం వద్ద త్రీడీ ప్రొడక్షన్ మ్యాపింగ్ ప్రదర్శించారు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా రాష్ట్ర అభివృద్ది తీరు, భవిష్యత్ లక్ష్యాలు వివరించేలా ప్రణాళికలు రచించారు. తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యాలు అర్థమయ్యే రీతిలో డిస్ప్లేలు, హుస్సేన్‌సాగర్ లో వాటర్ ప్రొజెక్షన్ ద్వారా ప్రత్యేక ప్రదర్శన, చార్మినార్, కాచిగూడ రైల్వేస్టేషన్ పై లైటింగ్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేశారు.
తేలియాడే గ్లోబ్
దుర్గం చెరువులో గ్లోబ్ ఆకారంలో తేలియాడే ప్రొజెక్షన్, తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లోగోను ఇన్‌లిట్ టెక్నిక్ తో ఏర్పాటు చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లోగోను ఇన్‌లిట్ టెక్నిక్‌తో ప్రదర్శించనున్నారు. హుస్సేన్‌సాగర్‌లో వాటర్ ప్రొజెక్షన్ ద్వారా భారత్ ఫ్యూచర్ సిటీ, మహిళా సాధికారత, యువత–రైతు ప్రధాన కార్యక్రమాలు, మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం వంటి ముఖ్య అంశాలను ప్రదర్శించనున్నారు. వలంటీర్లు ప్రజలకు సమిట్ డైలీ షెడ్యూల్‌ను వివరించి అవగాహన కల్పించేలా శిక్షణ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అందరి దృష్టిని ఆకర్శించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది.
…………………………………………..
