* రూ. 745 కోట్ల బకాయిలు విడుదల!
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ప్రభుత్వం రూ. 745 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిధులను కేటాయించింది. పెండింగ్లో ఉన్న వివిధ రకాల బకాయిలను ఈ నిధులతో సర్దుబాటు చేయనున్నారు. బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. అందులో భాగంగానే తాజాగా ఈ భారీ మొత్తాన్ని విడుదల చేసింది. కేవలం ఉద్యోగులకే కాకుండా, గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వం నిధులను పంపిణీ చేసింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రూ. 389 కోట్లను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పెండింగ్లో ఉన్న నిధులను విడుదల చేయడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సకాలంలో నిధులు విడుదల చేయడం వల్ల ఉద్యోగులకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిధుల విడుదల ద్వారా అటు ఉద్యోగులకు, ఇటు క్షేత్రస్థాయిలో గ్రామ పాలనకు మరింత బలం చేకూరనుంది.
