* మరోసారి హాట్ టాపిక్ గా గులాబీ బాస్
* తనదైన శైలిలో గర్జించడంతో చిగురించిన ఆశలు
* నేతలతో వరుస సమావేశాలు
* బీఆర్ ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం
* కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ.. ఎక్కడ చూసినా ఆ పార్టీ హడావిడే. అధికార పార్టీ హవా సాధారణమే అయినా.. ఇక్కడ ప్రతిపక్ష పార్టీకి ఉన్న చరిత్ర చిన్నదేం కాదు. ప్రత్యేక రాష్ట్ర పునాదులపై ఏర్పడ్డ పార్టీ అది. పదేళ్ల పాటు ఏకఛత్రాధిపత్యం సాధించిన పార్టీ. లక్షలాది మంది దండున్న పార్టీ.. అదే గులాబీ పార్టీ బీఆర్ ఎస్. అయితే 2023లో ఓటమి అనంతరం ఆ పార్టీలో జోష్ తగ్గింది. రెండేళ్ల అయినప్పటికీ దూకుడు పెరగలేదు. అసెంబ్లీ తర్వాత జరిగిన ఎంపీ, అసెంబ్లీ ఉప ఎన్నికలు.. తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా సత్తా చాటలేకపోయింది. దీంతో ఆ పార్టీ శ్రేణులు కూడా డీలా పడుతున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి రంగంలోకి దిగారు గులాబీ బాస్ కేసీఆర్. చాలా గ్యాప్ తర్వాత మీడియా సమావేశానికి వచ్చిన కేసీఆర్.. వస్తూ వస్తూనే.. ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. నేనే వస్తున్నా.. తోలు తీస్తా.. అంటూ కాంగ్రెస్, బీజేపీలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
కేసీఆర్ రంగంలోకి దిగితే..
ఇక నుంచి తానే రంగంలోకి దిగుతున్నానని కేసీఆర్ ప్రకటించడం బీఆర్ ఎస్ శ్రేణుల్లో తీవ్ర జోష్ నింపింది. అయితే అధికార పార్టీలో మాత్రం అంతర్మథనం మొదలైంది. ఆ మర్నాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో మాట్లాడి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలను తిప్పికొట్టాలని దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. అంతేకాదు.. అసెంబ్లీకి వస్తే చర్చిద్దాం అంటూ.. గౌరవంగా చూసుకునే బాధ్యత తనది అని రేవంత్ ప్రకటించారు. ‘కేసీఆర్ పనైపోయింది. ఇక ఆయన ఫాంహౌజ్‌కే పరిమితం.’ అని ఎద్దేవా చేస్తూ వచ్చిన అధికార పార్టీ కేసీఆర్ ఒక్క మీడియా సమావేశానికే అలర్ట్ అయిందనడంలో అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. బీఆర్ ఎస్ కార్యాలయం తెలంగాణభవన్ కేంద్రంగా కేసీఆర్ చేసిన ప్రసంగం కాంగ్రెస్ పార్టీని కాస్త కంగారు పెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నీళ్లే ఆయుధం
గులాబీ పార్టీకి మాత్రం కేసీఆర్ ప్రసంగం ఎనలేని బలాన్నిచ్చింది. వరుస ఎన్నికల్లో ఫలితాలతో డీలా పడ్డ శ్రేణులకు కొండంత ఉత్సాహాన్ని తెచ్చింది. పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టులకు ఆయన వేసిన ప్రశ్నలు, చేసిన పంచ్‌లు.. కేసీఆర్ తనదైన శైలిలో నిప్పులు చెరగడం.. ఇవన్నీ పార్టీకి శుభపరిణామంగా భావిస్తున్నారు. ఎన్నటికైనా తెలంగాణ అభివృద్ధికి, మంచికి పాటుపడేది తామేనని మరోసారి కేసీఆర్ పేర్కొనడం ద్వారా మళ్లీ ఉద్యమ కాలాన్ని ఆయన గుర్తు చేశారని బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. నాడు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన పార్టీ.. ఇప్పుడు నీళ్లు అంశాన్ని పైకి లేపుతోంది. దీని ద్వారా మరో ఉద్యమానికి తాము వారధులం అవుతున్నామని గులాబీ శ్రేణులు సమరోత్సాహం ప్రదర్శిస్తున్నాయి.
కేసీఆర్ ఈ దూకుడు కొనసాగిస్తారా?
ఇప్పటి వరకు కేసీఆర్ స్తబ్దుగా ఉండడంతో నిరాశలో ఉన్న గులాబీ శ్రేణులు ప్రజాక్షేత్రంలో బరిగీసి నిలబడతామని ఆయన అల్టిమేటమ్ ఇవ్వడంతో కాంగ్రెస్ పై యుద్ధానికి సిద్ధమవుతున్నారు. త్వరలో జరగనున్న మునిసిపల్, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమాయత్తం అవుతున్నారు. అధికారంలోకి వచ్చే వరకూ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మళ్లీ ఉద్యమాలకు శ్రీకారం చుడతామని ప్రకటిస్తున్నారు. ప్రధానంగా నీటి ప్రాజెక్టులపై బీఆర్ ఎస్ ఉద్యమానికి సిద్దమవుతోంది. దీంతో మున్ముందు రాజకీయ లెక్కలు మారే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. కేసీఆర్ ఇదే ఉత్సాహంతో ముందుండి పార్టీని నడిపితేనే అది సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి కేసీఆర్ ఇదే దూకుడు ప్రదర్శిస్తారా? అదే జరిగితే కాంగ్రెస్ వ్యూహం ఏంటనేది ఆసక్తిగా మారింది.
……………………………………………………………………

