* ప్రభుత్వ పాఠశాలల్లో నూతన ఒరవడి
* ప్రైమరీ క్లాస్లపై పెరుగుతున్న ఆసక్తి
* వచ్చే ఏడాది నుంచి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
ఆకేరు న్యూస్, డెస్క్ : తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విధ్యా విధానంలో కీలక మార్పులు తీసుకువస్తున్నది. ఇది ఆహ్వానించ దగినదే. అమలు తీరుపైనే ఫలితాలు ఉంటాయనే విషయం పాలకులు గుర్తుంచుకోవల్సిన అవసరం ఉంది. పాలక ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి. ఏ మార్పయినా సమకాలీన పరిస్థితులకు, భవిష్యత్తుకు అనుగుణంగా ఉండాలే తప్ప.. *వారు అది చేశారు.. మనం ఇది చేద్దాం* అన్న చందంగా ప్రస్తుత ప్రభుత్వాల తీరు ఉంది. దీని వల్ల లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందే తప్ప ప్రజలకు ఒనగూరేది పెద్దగా ఏమీ ఉండడం లేదు.
* ప్రైమరీ క్లాస్లపై ఆసక్తి..
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యారంగంలో తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులు మంచివే.. అయితే వాటి అమలు తీరుపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వ బడులు కేవలం చదువుకే కాకుండా, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి వేదికలుగా మారుతున్నాయి. 2025-26 విద్యా సంవత్సరం నుండే ఎంపిక చేసిన 210 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ప్రీ-ప్రైమరీ (నర్సరీ, LKG, UKG) సెక్షన్లు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు బోధనా పద్ధతుల్లో తెస్తున్న మార్పులు విద్యార్థులను, తల్లిదండ్రులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మూడేళ్ల వయసులోనే చిన్నారులను స్కూళ్లకు పంపించడానికి ఇష్టపడుతున్నారు.
ప్రీ-ప్రైమరీని వచ్చే ఏడాది నుంచి విస్తరించన్నారు.
* తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ , ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ కార్యక్రమాలను 2026-27 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. మొత్తం 100 నియోజకవర్గాల్లోని 100 మండలాల్లో 200 పాఠశాలలను ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’గా అప్గ్రేడ్ చేస్తున్నారు. ఇక్కడ నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన విద్య లభించనుంది. కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడమే సర్కారు ప్రధాన ఉద్దేశం. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాతిపదికన ప్రారంభించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.16.62 కోట్లు మంజూరు చేసింది.
* బీఆర్ఎస్ హయాంలో ఇలా..
బీఆర్ఎస్ హయాంలో ‘మన ఊరు – మన బడి’, ‘గురుకులాల విస్తరణ’ వంటి కార్యక్రమాలు జరిగినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రాలేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా కేజీ టూ పీజీ (KG to PG) ఉచిత విద్య హామీ పూర్తిస్థాయిలో నెరవేరకపోవడం, పాఠశాలల్లో మౌలిక వసతుల పనులు మధ్యలోనే నిలిచిపోవడం వంటివి ప్రధాన లోపాలుగా కనిపిస్తాయి. వీటిని అధిగమిస్తూ ప్రస్తుత ప్రభుత్వం తెస్తున్న మార్పులు ‘సమీకృత’ మరియు ‘అంతర్జాతీయ’ ప్రమాణాల చుట్టూ తిరుగుతున్నాయి.
