* గులాబీ బాస్ కుమార్తెను టార్గెట్ చేసిన గులాబీ శ్రేణులు
* వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహం
* ఉద్యమ పార్టీతో పూర్తిగా తెగిన కవిత బంధం
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారబోతుందా? గులాబీ శ్రేణులు గులాబీ బాస్ కుమార్తెను టార్గెట్ చేశాయా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో నాపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. నన్ను అవమానించేలా పోస్టులు పెడుతున్నారు.. అని జాగృతి అధ్యక్షురాలు కవిత స్వయంగా చాలా సందర్భాల్లో ప్రకటించారు. ఆమె పార్టీకి రాజీనామా చేయక ముందు నుంచే బీఆర్ ఎస్ సోషల్ మీడియా వేదికగా కవితకు వ్యతిరేక పోస్టులు వైరల్ అయ్యాయి. ఆమె రాజీనామా చేసిన తర్వాత సోషల్ మీడియాలోనే కాకుండా బహిరంగంగానే గులాబీ నేతలు కవితను విమర్శించడం మొదలుపెట్టారు. ఆమె ఎమ్మెల్సీ రాజీనామా ఆమోదంపై కూడా విభిన్న కథనాలు వైరల్ అయ్యాయి.
బీఆర్ ఎస్ సోషల్ మీడియాలో టార్గెట్
నాలుగు నెలల క్రితమే కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా ఆమోదం పొందలేదు. చట్ట సభల నియమావళి ప్రకారమే రాజీనామా సమర్పించినా శాసనమండలి చైర్మన్ ఆమోదించకపోవడాన్ని కూడా బీఆర్ ఎస్ టార్గెట్ చేసింది. ఆమె అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కాదు.. ప్రతిపక్ష నాయకుడికి చెందిన ఎమ్మెల్సీ.. అందులోని ప్రతిపక్ష నాయకుడికి స్వయాన కుమార్తె.. ఒక అధికార పక్షానికి చెందిన నాయకురాలు పదవిలో ఉన్నవాళ్ళు రాజీనామా చేస్తే ఏదో ఒక విధంగా మ్యానేజ్ చేయడం రాజకీయాల్లో సహజమే.. శాసన సభ స్పీకర్… మండలి చైర్మన్ అధికార పక్షానికి చెందిన వాళ్ళు ఉంటారు కాబట్టి రాజీనామాలను పెండింగ్ లో పెట్టే విషయంలో సమస్య పెద్దగా ఉండదు. రాజీనామా ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టీ నాలుగు నెలల తర్వాత ఆమెను శాసనమండలి సమావేశాలకు అనుమతించడం.. ఆమె ఎంతసేపు మాట్లాడితే అంత సేపు అన్నట్లుగా మాట్లాడే అవకాశాన్ని ఇవ్వడం.. అంతా రాజకీయ వ్యూహంలో భాగమనే చర్చను తెరపైకి తెచ్చారు. దీనికి బీఆర్ఎస్ సోషల్ మీడియానే ప్రధాన కారణమని జాగృతి ఆరోపిస్తోంది.
బీఆర్ఎస్ తో బంధం పూర్తిగా కట్
ఇక ఉద్యమ పార్టీ బీఆర్ ఎస్ తో కవిత బంధం పూర్తిగా తెగిపోయింది. ఆమె రాజీనామాను శాసనమండలి చైర్మన్ తాజాగా ఆమోదించడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అనే ట్యాగ్ లైన్ కట్టయింది. దీంతో గులాబీ పార్టీ అటాక్ తీవ్రతను పెంచినట్లు కనిపిస్తోంది. శాసనమండలిలో ఆమె మాట్లాడిన మాటలన్నీ కాంగ్రెస్ రాసి ఇచ్చినవే అని ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ఆమె అధికార పార్టీ స్క్రిప్ట్ ను చదివారని ప్రచారం జరుగుతోంది. కవిత రాజకీయ పార్టీ, బీఆర్ ఎస్ విమర్శలు చేస్తారని ముందుగానే పసిగట్టిన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా శాసనమండలి సమావేశాల ప్రారంభానికి ముందు నుంచే ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం ప్రారంభించింది. కవిత కచ్చితంగా సభలో సెంటిమెంట్ డ్రామా ఆడబోతోందని.. గులాబీ పార్టీకి చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రచారం మొదలు పెట్టాయి. సమావేశం ముగిసిన అనంతరం ఆమె ఎంతసేపు మాట్లాడితే అంత సేపు అవకాశం ఎలా ఇచ్చారని ప్రశ్నలు సంధిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ తో చేతులు కలిపిన కవిత.. పక్కా ప్లాన్ తోనే తమ పార్టీపై మండలి వేదికగా నోరుపరేసుకుందని తీవ్ర పదాలతోనే గులాబీ సోషల్ మీడియా విమర్శిస్తోంది.
కౌంటర్.. ఎన్ కౌంటర్లకు సిద్ధం
ఇవన్నీ గమనిస్తే ఇకపై బీఆర్ ఎస్ వర్సెస్ కవిత అన్నట్లుగానే రాజకీయం ఉండనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే కవిత మళ్లీ యాక్టివ్ అయి.. గులాబీ పార్టీపై విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరవీరుల స్తూపం నిర్మాణంలోనూ గులాబీ నేతలు అవినీతికి పాల్పడ్డారని సోమవారం ఆరోపించిన ఆమె.. ఇకపై మరిన్ని లొసుగులను బయటకు తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఆమెకు కౌంటర్లు ఇచ్చేందుకు సోషల్ మీడియా విభాగానికి ఇప్పటికే గులాబీ పార్టీ దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. పార్టీ ఆవిర్భావం అనంతరం జాగృతి, బీఆర్ ఎస్ ల మధ్య వార్ ఎలా ముదురుతుందనేది వేచి చూడాలి.
………………………………..
