* కుటుంబ విబేధాలతో గతంలోనూ కొత్త పార్టీలు
* మనుగడ సాధించినవి శూన్యం
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం నుంచి మరో పార్టీ ఉద్భవించబోతోంది. కొత్త పార్టీ పెడుతున్నట్లు కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. కొద్దిరోజులుగా కొనసాగుతున్న అనుమానాలకు తెర దించారు. అవును.. నేను రాజకీయ పార్టీ పెట్టబోతున్నాను.. అని గన్‌పార్కు సాక్షిగా ప్రకటించారు. సోమవారం నాడు శాసనమండలి నుంచి బయటకు వచ్చిన తర్వాత గన్‌పార్క్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆమె.. తన నేతృత్వంలో నడుస్తున్న జాగృతి సంస్థనే పార్టీగా మార్చబోతున్నట్లు తెలిపారు. అంతేకాదు.. తనకు మద్దతివ్వాలని మైనార్టీలు, సెక్యులర్లు, మావోయిస్టు సానుభూతిపరులు, యువత, నిరుద్యోగులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సెంటిమెంట్ తో పుట్టిన టీఆర్ ఎస్ పేరు మార్చడాన్ని తాను వ్యతిరేకించినా ఎవరూ పట్టించుకోలేదని కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఇంటి పార్టీ నుంచి అవమాన భారంతో బయటకు వస్తున్నానని, గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతామన్నారు. సమస్యలపై పోరాడుతామన్నారు.
రాజకీయాల్లో మార్పు తెచ్చేనా?
కవిత పార్టీ మనుగడ సాధిస్తుందా.. లేదా అనేది పక్కన పెడితే రాజకీయంగా ఏ పార్టీకి మేలు చేస్తుంది అనే చర్చ కూడా మొదలైంది. గత ఎన్నికల్లో ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుని జనాల్లోకి వెళ్లేందుకు కష్టపడుతోంది. అందరినీ మళ్లీ తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. తాజాగా కేసీఆర్ కూడా రంగంలోకి దిగి మరోసారి తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆయన కుమార్తె కవిత బీఆర్ఎస్ పై తీవ్ర ఆరోపణలు చేయడం మరోసారి వివాదాస్పదంగా మారింది. ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, ప్రశ్నిస్తే కక్షగట్టారని, తనను ఘోరంగా అవమానించారని ఆరోపించారు. ఈడీ, సీబీఐ పోరాటంలో అండగా నిలవలేదని, కేసీఆర్ పై అక్కసుతోనే బీజేపీ తనను జైలులో పెట్టించిందని విమర్శించారు. కొత్త రాజకీయ శక్తిగా ఎదుగుతామని వెల్లడించారు. రాజకీయాల్లో మార్పు తెచ్చే వేదికగా జాగృతి అవతరిస్తుందని ప్రకటించారు.
టార్గెట్ బీఆర్ఎస్సేనా?
కవిత పార్టీ ప్రకటన సందర్భంలో బీఆర్ ఎస్ టార్గెట్ గానే ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. ఆస్తుల కోసం కాదు.. తనది ఆత్మగౌరవ పోరాటం అన్నారు. బీఆర్ ఎస్ నుంచి బయటకు రావడం సంతోషంగా ఉందని, పదేళ్ల ఆ పార్టీ పాలనలో ఆశలన్నీ ఆడియాసలు అయ్యాయని, ఉద్యమకారులకు గుర్తింపు లేదు కదా.. స్మారక స్థూపం నిర్మాణంలోనూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అలాగే.. కాంగ్రెస్ పైనా విమర్శలకు కురిపించారు. తనది ఆస్తుల కోసం పోరాటం అంటూ కాంగ్రెస్ వాడుకుంటోందని అన్నారు. ఇదిలాఉంటే.. ఆమె చదివింది కాంగ్రెస్ రాసిన స్క్రిప్ట్ అంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారం మొదలుపెట్టారు. అంటే.. కవిత పార్టీ పెడితే కాస్తో కూస్తో తమకు నష్టం వాటిల్లుతుందని వారు భావిస్తున్నట్లుగా స్పష్టం అవుతోంది. అంతేకాదు.. కవిత పార్టీ పెట్టడం ఖాయమని ఎప్పుడో భావించిన బీఆర్ఎస్ శ్రేణులు.. ఆ ప్రభావం తమ పార్టీపై పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కీలక నేతలతో కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
బీజేపీకి లాభమెంత?
తెలంగాణలో అధికారం సాధించాలని భావిస్తున్న కాషాయ పార్టీగా కూడా తాజా రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. కవిత పార్టీ పెడితే అది ఎంతో కొంత బీఆర్ఎస్ కు నష్టమే. అలాగే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. వాటిని అనుకూలంగా చేసుకుంటూ, కేంద్రంలో బీజేపీ అవలంబిస్తున్న ప్రజాకార్షక పథకాలపై ఎక్కువ ఫోకస్ పెట్టి.. తెలంగాణలో ఎదగాలని కాషాయ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే.. పంచాయతీ ఎన్నికల్లో కనీస ప్రభావం చూపలేకపోయిన బీజేపీ ఎంత వరకు అధికారం దిశగా వెళ్తుందనేది ఇప్పుడే చెప్పడం కష్టమే.
గతంలోనూ కొత్త పార్టీలు..
రాజకీయంగా కుటుంబాల్లో తలెత్తిన విబేధాలతో గతంలోనూ కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. కానీ.. మనుగడ సాధించలేకపోయాయి. గతంలో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ (ఏటీడీపీ), లక్ష్మీపార్వతి (ఎన్టీఆర్ టీడీపీ), ఏపీలో షర్మిల (వైఎస్ఆర్టీపీ) తదితర పార్టీలు పుట్టుకొచ్చాయి. అలాగే ప్రజారాజ్యం పార్టీ, గద్దర్ స్థాపించిన తెలంగాణ ప్రజా పార్టీ, మహా జన సోషలిస్టు పార్టీ (మందకృష్ణ), తెలంగాణ జన సమితి (టీజేఎస్) వంటి పార్టీలు ఆవిర్భవించాయి. కానీ మనుగడ సాధించలేకపోయాయి. మరి కవిత స్థాపించబోయే పార్టీ ఎంత వరకు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేస్తుందనే ఉత్కంఠ ఏర్పడింది.
……………………………………………………..

