
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ బియ్యం ఫిలిప్పిన్స్కి ఎగుమతి కానున్నాయి. ఈ మేరకుతెలంగాణ ప్రభుత్వంతో ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం ఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ మంత్రి,తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య ఢిల్లీలో సమావేశం జరిగింది. ఈ భేటీలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేయాలనే ఒప్పందం కుదిరింది. దీంతో పాటు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం మొక్కజొన్న ఎగుమతులపై (corn exports) కూడా ఆసక్తి చూపింది. త్వరలోనే దీన్నిగురించి ప్రత్యేకమైన చర్చలు జరిపి మరో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని సమాచారం. సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పండించే తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్- 15048) రకం బియ్యానికి ఫిలిప్పీన్స్‌లో మంచి డిమాండ్ ఉందని తెలిపారు. ఈ భేటీలో కేవలం బియ్యం ఎగుమతి గురించే కాకుండా.. తెలంగాణలో పండే మొక్కజొన్నపై కూడా ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఆసక్తి చూపించిందని మంత్రి ఉత్తమ్ అన్నారు.ఈక్రమంలో ఫిలిప్పీన్స్‌కు బియ్యంతో పాటు మొక్కజొన్న ఎగుమతులు కూడా ప్రారంభమైతే.. ఆ దేశంతో తెలంగాణ వాణిజ్య సంబంధాలు మరింత మెరుగవుతాయని మంత్రి ఉత్తమ్ ఆశాభావం వ్యక్తం చేశారు ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ మంత్రి ఫ్రాన్సిస్‌తో మాట్లాడుతూ.. తమ దేశానికి 20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉందని వెల్లడించారు. అలానే ఫిలిప్పీన్స్ మంత్రిని తెలంగాణ పర్యటనకు ఆహ్వానించామని.. దానిపై ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.
……………………………………………