* చెమటోడ్చుతున్న ప్రముఖులు
* ఈ ఎన్నికల్లో గెలిచి.. మళ్లీ గాడిన పడాలని..
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ :
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నవి మునిసిపల్ ఎన్నికలైనా.. నేతల మాటలు.. ఆరోపణలు.. ప్రత్యారోపణలు మాత్రం వాడివేడీగా ఉంటున్నాయి. ప్రచారంలో హాట్ హాట్ ప్రసంగాలు చేస్తున్నారు. చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. అధికార పక్షం నుంచి ఏకంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ అప్రమత్తమైంది. ప్రచారంలో జోరు పెంచేందుకు సిద్ధమైంది. ఎందుకంటే.. ఈ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ కంటే బీఆర్ ఎస్ కు చాలా ముఖ్యం. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఆ పార్టీకి ప్రతీ ఎన్నికలోనూ పరాభవమే ఎదురవుతోంది. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కాస్త ప్రభావం చూపినా, అంతకు ముందు జరిగిన ఎంపీ, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది.
బలపడేలా వ్యూహాలు
ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో మనగలగాలంటే మునిసిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలని బీఆర్ ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. పురపోరుతో మళ్లీ గాడిన పడాలని, పూర్వవైభవం దిశగా సాగాలని ప్రచారంలో దూసుకెళ్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా.. బీఆర్ ఎస్ కు చెందిన కీలక నేతల చుట్టూ సమస్యలు అలుముకుంటున్నాయి. ఫోన్ ట్యాపింగ్, మేడిగడ్డ తదితర కేసులతో సర్కారు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇటువంటి క్రమంలో మునిసిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించి ప్రజలు తమవైపే ఉన్నారని చెప్పుకోవాలని ప్రతిపక్షం తహతహలాడుతోంది. దీని ద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలపడాలని వ్యూహాలు రచిస్తోంది. పార్టీ గుర్తులతో జరిగిన ఎన్నికలు కాకపోవడంతో పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు అనేది లెక్క పక్కాగా చెప్పుకోలేకపోయింది. దీంతో పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు దక్కించుకోవాలని గులాబీ పార్టీ భావిస్తోంది.
ప్రచారాలు.. సమావేశాలు..
తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లలో మెరుగైన సంఖ్యలో స్థానాలు సాధించాలని ఇప్పటికే అధిష్ఠానం పలుమార్లు సమావేశమైంది. గులాబీ బాస్ కేసీఆర్ కూడా ముఖ్య నాయకులతో ఈ మేరకు చర్చించారు. ఎన్నికల సన్నాహాకాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులు, ఇన్చార్జులు పార్టీ జిల్లా అధ్యక్షులతో హరీశ్ రావు, కేటీఆర్‌లు సమావేశమవుతూనే ఉన్నారు. మరోవైపు ప్రచారంలోనూ పాల్గొంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా ప్రజల మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే, సంక్షేమ పథకాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని ఆరోపిస్తున్నారు. ష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు పంచాయతీ ఎన్నికలే నిదర్శనమని ప్రచారం చేస్తున్నారు.
చెమటోడ్చుతున్న కీలక నేతలు
అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను, అమలులో విఫలమైన తీరును వర్గాల వారీగా వివరిస్తూ మరీ బీఆర్ ఎస్ ముఖ్యనాయకులు ప్రచారం సాగిస్తున్నారు. అలాగే, కేసీఆర్ తెలంగాణ జాతిపితే అని చాటి చెబుతూ పదేళ్ల ఆయన హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీ సభలు, సమావేశాలు, రోడ్ షోలు లేకుండా ప్రతి ఓటరును కలిసేలా ఇంటింటి ప్రచారం నిర్వహించేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం ద్వారా రానున్న శాసనసభ ఎన్నికలకు మార్గం సుగమమం చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఈ ఎన్నికల్లోనే ప్రజలు గులాబీ పార్టీకి పట్టం కావాలంటూ ప్రచారం చేస్తూ చెమటోడ్చుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి.. పార్టీని మళ్లీ గాడిన పడాలని ఆరాటపడుతున్నారు. మరి ఈ పోరాటంలో ఎంత వరకు విజయం సాధిస్తారు అనేది వేచి చూడాలి.
………………………………………………………..
