సుప్రీంకోర్టు
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. సోషల్ మీడియా వేదికగా చేస్తున్న రాజకీయ పోస్టులపై వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసుల వ్యవహారంలో.. పోలీసుల తీరును గతంలో తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. రాజకీయ విమర్శలు చేసినంత మాత్రాన క్రిమినల్ కేసులు పెట్టడానికి వీల్లేదంటూ హైకోర్టు గతంలో వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీలును సుప్రీంకోర్టు తిరస్కరించింది. సోషల్ మీడియాలో రాజకీయ నాయకులను విమర్శిస్తే ఐపీసీ/బీఎనఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయకూడదని, దీనికి సంబంధించి పకడ్బందీ మార్గదర్శకాలు పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది. బాధితులతో సంబంధం లేని థర్డ్ పార్టీ వ్యక్తులు ఇచ్చే ఫిర్యాదులపై ఎఫఐఆర్లు నమోదు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది. వాక్ స్వాతంత్య్రాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని, కేవలం విమర్శలకే అరెస్టులకు పాల్పడటం సరికాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టు జారీ చేసిన ఈ మార్గదర్శకాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించడంతో, ఇకపై సోషల్ మీడియా పోస్టుల విషయంలో పోలీసులు ఆచితూచి వ్యవహరించక తప్పని పరిస్థితి నెలకొంది.
………………………………………………
