* చంచల్గూడ జైలు కేంద్రంగా విధ్వంసానికి ప్లాన్?
ఆకేరు న్యూస్, హైదరాబాద్: భాగ్యనగరంలో మరోసారి ఉగ్రవాద అలజడి మొదలైంది. నగరాన్ని అతలాకుతలం చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు వెలుగులోకి వచ్చిన సమాచారం సంచలనం సృష్టిస్తోంది. ఈసారి ఈ విధ్వంసకర ప్రణాళికలు ఏకంగా చంచల్గూడ జైలు నుంచే రూపుదిద్దుకోవడం నిఘా వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. నగరంలో వరుస పేలుళ్లకు పాల్పడేందుకు జైలు లోపల నుంచే సందేశాలు బయటకు వెళ్లినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. నిషేధిత లష్కరే తోయిబా (LeT) సంస్థకు చెందిన ఒక ఉగ్రవాది ఈ కుట్ర వెనుక సూత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది. జైలు నుంచే తన అనుచరులకు దిశానిర్దేశం చేస్తూ, విధ్వంసానికి పథకం రచించినట్లు ప్రాథమిక సమాచారం. ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. జైలులో ఉన్న నిందితులను కలవడానికి వచ్చిన ‘ములాకత్’ సందర్శకులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సందర్శకుల ఫోన్ కాల్స్, వారి నెట్వర్క్ను పరిశీలిస్తున్నారు. ఈ కుట్రకు ఎక్కడి నుంచైనా నిధులు అందాయా అనే కోణంలో బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేస్తున్నారు.
* నగరంలో హై అలర్ట్..
ఉగ్రకుట్ర వార్తల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో నిఘా పెంచారు. ముసారాంబాగ్, సైదాబాద్, మలక్పేట్ వంటి ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. వాహన తనిఖీలు మరియు అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై డేగకన్ను వేశారు. నగరం సురక్షితంగా ఉండాలంటే ప్రజల సహకారం అవసరమని అధికారులు కోరుతున్నారు. మీ పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా లేదా గుర్తుతెలియని వస్తువులు కనిపిస్తే వెంటనే ‘డయల్ 100’ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతున్నందున మరిన్ని వివరాలను వెల్లడించేందుకు పోలీసు ఉన్నతాధికారులు నిరాకరిస్తున్నారు.
కాగా అవన్నీ వదంతులే , ఆందోళన అవసరం లేదని జైళ్ళ శాఖ డిఐజి శ్రీనివాస్ తెలిపారు.
