
ఆకేరున్యూస్, భువనగిరి: పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట.. చావు మేళం మోగింది. బిడ్డ పెళ్లిని.. వైభవంగా చేసి.. ఆనందంగా ఆమెను అత్తారింటి పంపాలని కలలు గన్న తల్లిండ్రులు ఇప్పుడు కన్నీళ్లలో స్మశానానికి సాగనంపాల్సి వచ్చింది. 10 రోజుల్లో పెళ్లి ఉందనగా.. లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిరది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరిలో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లాకు చెందిన అనూష యాదాద్రి భువనగిరి పోలీస్‌హెడ్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఇటీవలే అనూషకు పెళ్లి కుదిరింది. మార్చి 6న పెళ్లి నిశ్చయించారు పెద్దలు. వివాహం అంగరంగవైభవంగా చేసేందుకు ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. కానీ ఏమైందో ఏమో.. అనూష ఈనెల 25న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కుతుంది అనుకున్న కూతురు ఉరి తాడుకు వేలాడటం చూసి తల్లిదండ్రులు విలవిల్లాడిపోయారు. గుండెలవిసేలా రోదించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఇంటికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి.. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
…………………………………….