
* బీజేపీలోకి బీఆర్ ఎస్ విలీనంపై బండి సంజయ్
* సీఎం రమేష్ వ్యాఖ్యలపై క్లారిటీ
* కరీంనగర్లో చర్చకు సిద్ధమా?
* కేటీఆర్ కు సవాల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ఎస్ కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ అని ఎన్నోసార్లు చెప్పామని, బీఆర్ ఎస్‌ను బీజేపీలో విలీనం చేసుకునే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తేల్చిచెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా నిజామాబాద్ సభలో ఇదే చెప్పారన్నారు. బీఆర్ఎస్ అంటే బిడ్డా, అల్లుడు, కొడుకు, అయ్య పార్టీ అని బండి సంజయ్ అభివర్ణించారు. అంతేకాదు, కేటీఆర్‌కు సిరిసిల్ల ఎమ్మెల్యే టికెట్ సీఎం రమేష్ సాయంతోనే వచ్చిందన్నారు. కేసీఆర్ మొదట కొడుకుకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం గురించి సీఎం రమేష్ చెప్పిన విషయాలు నిజమని, కానీ బీజేపీ అలాంటి విలీనాన్ని ఒప్పుకోదని స్పష్టం చేశారు. కేటీఆర్ ఢిల్లీలో తన ఇంటికి వచ్చి, కవిత విషయంలో విచారణ ఆపాలని, బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామని చెప్పారని ఆరోపించారు. బండి సంజయ్, కేటీఆర్‌ను ఉద్దేశించి, ఆయన భాషను మార్చుకోవాలని, పోలీసులను అవమానించడం, బీజేపీ నేతలపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. వీటిపై కరీంనగర్లో చర్చకు రావాలని సవాల్ చేశారు. ఈ క్రమంలో వేదిక తాను ఏర్పాటు చేస్తానని, తేదీని కేటీఆర్ చెప్పాలని సవాల్ విసిరారు. ఈ వివాదంలో ఎవరి వాదనలు నిజమో తేల్చేందుకు బహిరంగ చర్చకు రావాలని బండి సంజయ్ కోరారు. సీఎం రమేష్‌ను తాను తీసుకొస్తానని, కేటీఆర్ రావడానికి సిద్ధమా అంటూ ప్రశ్నించారు.
…………………………………