
* 70 ఏళ్ల వయసులోనూ మూవీ గ్లింప్స్ లో అదుర్స్
* హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ చిరంజీవి
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
పరిచయం అక్కర్లేని పేరు చిరంజీవి. అదే మెగాస్టార్ చిరంజీవి. ఈరోజు ఆయన 70వ పడిలోకి అడుగుపెట్టారు. ఏకంగా 47 ఏళ్ల సినీ ప్రస్థానం ఆయన సొంతం. అయినప్పటికీ ఎక్కడా ఆయన క్రేజు తగ్గలేదు సరికదా.. అంతకంతకూ పెరుగుతూనే ఉంది. పుట్టిన రోజు సందర్భంగా నిన్న, ఈరోజు విడుదలైన ఆయన కొత్త సినిమా పోస్టర్లు, మూవీ గ్లింప్స్, అనిల్ రావిపూడి – మెగాస్టార్ కాంబినేషన్ లో వస్తున్న మెగా 157 ఫస్ట్ గ్లింప్స్ చూస్తే ఇందుకుకదా ఆయన మెగాస్టార్ అయ్యారు అని విమర్శకులు సైతం ప్రశంసించకమానరు. బప్పీలహరి – చిరంజీవి హిట్స్ లో పాపులర్ గా నిలిచిన రౌడీ అల్లుడు సినిమాలోని – లవ్లీ మై హీరో – సాంగ్ మ్యూజిక్ తో వచ్చిన మన శంకరవరప్రసాదర్ గారు.. పండగకు వస్తున్నా మూవీ గ్లింప్స్… ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నిన్న విడుదల చేసిన విశ్వంభర పోస్టర్‌లోని లుక్ కూడా అదిరిపోయింది. వయసు పెరిగినా, ఎనర్జీ మాత్రం తగ్గలేదంటూ ఆయన అభిమానులు ఉత్సాహపడుతున్నారు. ఈరోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించిన కొన్ని విశేషాలు ఆకేరు న్యూస్‌లో..
చిరంజీవి మెగాస్టార్ ఎప్పుడు అయ్యారంటే..
చిరంజీవి 1978లో సినీరంగ నటనలో ప్రవేశం చేశారు. సపోర్టింగ్ కేరెక్టర్లతో సినీ ప్రస్థానం మొదలుపెట్టి.. విలన్, విరోధి పాత్రల్లో గుర్తింపు పొందారు. అలా అలా ప్రధాన పాత్రలు రావడం మొదలయ్యాయి. తొలి చిత్రం పునాదిరాళ్లయిన తొలుత విడులైన చిత్రం ప్రాణం ఖరీదు. తర్వాత కొన్నాళ్లు చెప్పుకోదగ్గ సినిమా లేవు. 1983 లో ఖైదీ ఖైదీ చిత్రం చిరంజీవి జీవితాన్ని మలుపు తిప్పేసింది. ఇది ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది. చిత్ర పరిశ్రమలో అతడిని ప్రముఖ నటుడిగా నిలబెట్టింది. ఆ తర్వాత పసివాడి ప్రాణం (1987), యముడికి మొగుడు (1988), మరణమృదంగం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989), జగదేకవీరుడు అతిలోక సుందరి, (1991) ఘరానా మొగుడు (1992) ఘరానా మొగుడు ₹ 10 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ వాటాను సంపాదించిన మొదటి దక్షిణ భారత చిత్రంగా నిలిచింది. తొలినాళ్లలో చిరంజీవి సుప్రీంహీరోగా ముద్రపడ్డారు.
సుప్రీంహీరో నుంచి మెగాస్టార్
1980 వ దశకంలో చిరంజీవికి తిరుగులేదు. సూపర్‌హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. మంచి క్రేజ్, స్టార్డమ్ సంపాదించుకున్నారు. అయినప్పటికీ.. ‘సుప్రీమ్ హీరో’ అనే టైటిల్ మాత్రమే వాడుతుండేవారు. తీరిక లేకుండా ఏడాదికి 7-8 సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉండేవారు. అలాగే సినిమా సినిమాకు మెల్లగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. అయితే, 1988లో వచ్చిన ‘మరణ మృదంగం’ సినిమా మెగాస్టార్ కెరీర్లో చాలా స్పెషల్. ఆ సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించగా కేఎస్ రామారావు నిర్మించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆయన పెరుగుతున్న పాపులారిటీ, సినిమా మొత్తం రష్ను చూసి నిర్మాత కె.ఎస్. రామారావు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరికి లేని ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని భావించి, టైటిల్ కార్డులో మొదటిసారి ‘మెగాస్టార్’ అని చూపించారు. అదే ఈ రోజు వరకు చిరంజీవికి సింబాలిక్‌గా మిగిలిపోయింది. నాటి నుంచి నేటికీ వరకూ ఆయన ‘మెగాస్టార్ గా వెండితెరపై నిలిచిపోయారు. మరణ మృదంగం సినిమా నుంచీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా రికార్డుల మోతెక్కిస్తూనే ఉన్నారు. నాటి నుంచి విభిన్నతరహా పాత్రలతో ఆకట్టుకుంటూ 70 ఏళ్ల వయసులో “మన శంకరవరప్రసాద్ గారు” పండగకు అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
…………………………………………..