
* మావోయిస్ట్ పార్టీ నిర్ణయం కాదు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సాయుధ పోరాట విరమణ అంశానికి మావోయిస్ట్ పార్టీ ముగింపు పలికింది. మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి సోను అలియాస్ అభయ్ పేరుతో తాత్కాలిక సాయుధ పోరాట విరమణ ప్రకటన ఆయన వ్యక్తిగత మే కాని మావోయిస్ట్ పార్టీ సంస్థాగత నిర్ణయం కాదని సీపీఐ మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటి అధికార ప్రతినిధి పేరుతో ప్రకటన విడుదలయింది. కేంద్రంలోని బిజెపి పార్టీ విప్లవోద్యమ నిర్మూలనకు ఎప్పటినుండో పథకాలు వేసుకొని అమలు జరుపుతూ 2024 జనవరి నుండి కగార్ అనే పేరుతో భారీ స్థాయి యుద్ధ చర్యలతో నాయకత్వాన్ని, క్యాడర్లను మరియు ప్రజలను కూడా నిర్మూలించే కార్యక్రమాన్ని కొనసాగిస్తోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు . 2025 మార్చిలో కొంత మంది ప్రజాస్వామిక మేధావులు పీస్ డైలాగ్ కమిటీగా ఏర్పడి ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీకి మధ్య శాంతి చర్చలు జరగాలనే ప్రతిపాదనను చేసింది. ఆ ప్రతిపాదనకు జవాబుగా కేంద్ర కమిటీ పరిస్థితిని వివరిస్తూ- కూంబింగులు, హత్యాకాండ ఆపాలని కొత్త క్యాంపుల నిర్మాణాన్ని నిలుపుదల చేసి శాంతియుత వాతావరణంలో చర్చలు జరుపాలనే విషయాన్ని కేంద్ర కమిటీ ప్రకటించిందన్నారు.
ఇదీ.. మావోయిస్ట్ నేత జగన్ ప్రకటన సారాంశం..
ఆయన మాటల్లోనే..
దేశ వ్యాప్తంగా కగార్ ను నిలుపుదల చేయాలని ఆందోళన చేసినప్పటికీ బీజేపీ ప్రజా వ్యతిరేకంగా హింసా ప్రవృత్తితో ఈ హత్యాకాండను కొనసాగిస్తోంది. పైగా మావోయిస్టులతో చర్చించేది లేదని, ఆయుధాలు విడిచి సరెండర్ కావాలని పదే పదే బీజేపీ నాయకులు ప్రకటిస్తున్నారు. మేము చర్చించేది లేదంటూ, మరొక పక్క హత్యాకాండను కొనసాగిస్తూ ఉండగా మాకు నెల రోజులు సమయం ఇవ్వాలని అడగటం అనాలోచిత చర్య. కేంద్ర కమిటీ సభ్యుడైన కామ్రేడ్ సోనూ సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నామని ఎక్కడెక్కడో సుదీర్ఘంగా ఉన్న పార్టీ నాయకులతో, కార్యకర్తలతో అభిప్రాయాలు తెలుసుకోవడానికి నెల రోజుల వ్యవధి కావాలని, పార్టీ కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను తాను ఇచ్చిన ఈమెయిల్ అడ్రెస్ కు పంపాలని కోరుతూ ప్రకటన ఇచ్చాడు. ఈ విధంగా ప్రకటించడం ఏ పద్ధతి అనాలో అర్థం కావటం లేదు. ఉద్యమాన్ని విడిచి ముఖ్యధారలో కలసి లీగల్ గా పనిచేయదలుచుకున్నప్పుడు పార్టీ కమిటీలో చర్చించి అనుమతి పొందవచ్చు. తన అభిప్రాయాన్ని పార్టీ ఛానల్ లో పంపించి ఉంటే తన ప్రశ్నకు జవాబులు దొరికేవి. అది చేయక పోగా ఇటువంటి కీలక విషయాన్ని బహిరంగంగా ప్రకటించడం ద్వారా పార్టీ శ్రేణుల్లోనూ, విప్లవ శిబిరంలోనూ గందరగోళం తలెత్తుంది. తాను అనుసరించిన పద్దతి ఉద్యమానికి ఉపయోగ పడకపోగా నష్టం చేస్తుంది. నేడు దేశంలోని ఏ పార్టీ అయినా ఇటువంటి నిర్ణయాలను ఇంటర్నెట్ ద్వారా బహిరంగ చర్చకు పెట్టి పరిష్కరించాలని ఎవరు అలా చేయరు. అటువంటిది రహస్య పార్టీ, కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడిన పార్టీ, తీవ్రమైన దమనకాండ అమలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో సరిగ్గా ఆలోచించే వాళ్లు ఇలా చేయరు. నేడు పార్టీలో పై స్థాయి నుండి క్రింది వరకుఎదుర్కొంటున్న సమస్య మీద అందరూ తీవ్రంగానే ఆలోచిస్తున్నారు. అనవసరంగా నష్ట పోవాలని ఎవరు అనుకోవటం లేదు. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఏ విధంగా బహిరంగా ప్రకటనలతో అయ్యేది కాదు. ఒక భయంకరమైన దమనకాండలో ఇటువంటి నష్టాలు జరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. ఈ సమస్యకు ఇప్పటికీ ఇప్పుడే పరిష్కారం దొరకక పోవచ్చు. 2024లో పాలిట్ బ్యూరో విడుదల చేసిన సర్క్యులర్ ను అమలు జరపటమే తక్షణ కర్తవ్యం. నేడు పాలస్తీనా విషయంలో నేడు మారణకాండ జరుగుతున్నదో ప్రపంచ వ్యాప్తంగా అర్థం అవుతుంది. అనగా ప్రపంచ వ్యాప్తంగానే దమనకాండ స్థాయి పెరిగిందని అర్థమవుతుంది. ఇంటువంటి పద్ధతులు ఉద్యమానికి నష్టం కలిగించేవే కానీ ప్రయోజనం ఏ మాత్రం లేనివి. ఇది పార్టీ అధికారిక ప్రకటన కాదు. విప్లవ శిబిరం, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు దీనిని అధికారిక ప్రకటనగా గుర్తించాల్సిన అవసరం లేదు. ఈ ప్రకటనతో గందరగోళ పడాల్సిన అవసరం లేదు. ఫాసిస్టు బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు తీవ్రతరం చేయాలని మావోయిస్ట్ నేత ప్రకటనలో పేర్కొన్నారు.
———————————————