
* మహానగరంలో రేపే మిస్ట్ వరల్డ్ పోటీలు ప్రారంభం
* ఆందోళనబాటలో ఆర్టీసీ సంఘాలు
* సంకటంలో తెలంగాణ సర్కారు
* సమస్యల పరిష్కారంపై పట్టువీడని సంఘాలు
* సహకరించాలని ప్రజలకు విన్నపాలు
* బస్ భవన్ వద్ద గందరగోళం
* సీఎం రేవంత్ గరం.. గరం..
* ఎవరిపైనా మీ సమరం అంటూ ప్రశ్నల వర్షం
* సమ్మె ఉంటుందా.. లేదా?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రపంచవ్యాప్త అతిపెద్ద ఈవెంట్కు తెలంగాణలోని హైదరాబాద్ మహానగరం వేదికగా మారింది. రేపు ప్రారంభమయ్యే 72వ మిస్ వరల్డ్ పోటీలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ వేడుకలో హాజరయ్యేందుకు ఏకంగా 120 దేశాల నుంచి సుందరీమణులు రానుండగా, ఇప్పటికే కొందరు విచ్చేశారు. మిస్ బ్రెజిల్ జెస్సికా స్కాండుజ్ పెద్రోసో, మిస్ సౌత్ ఆఫ్రికా జోయాలిజే జాన్సన్వాన్ రెన్స్బర్గ్ సహా దాదాపు 90 మంది పోటీదారులు హైదరాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయంలో పర్యాటక శాఖ అధికారులు వీరికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలుకుతున్నారు. అనంతరం వారిని బస ఏర్పాటు చేసిన హోటళ్లకు తరలిస్తున్నారు. నగరంలో ఉన్నవారు కొన్నిచోట్ల పర్యటిస్తున్నారు కూడా. ఈనేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో మరోసారి సమావేశమయ్యారు. ఇది రాష్ట్రానికి చాలా ప్రతిష్టాత్మకమని, పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి తరుణంలో ఉండగా.. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడంతో సర్కారు సంకటస్థితిలో పడింది.
అదే పూట.. ఆందోళన బాట
ప్రతిష్ఠాత్మక 72వ మిస్ వరల్డ్ పోటీలు రేపే హైదరాబాద్లో ప్రారంభంకానున్నాయి. అదే రోజు ఆర్టీసీ సంఘాలు కూడా సమ్మెకు పిలుపునిచ్చాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఆర్టీసీ కార్మిక నేతలతో సమావేశమయ్యారు. సమ్మెను ఉప సంహరించుకోవాలని వారికి ఆయన సూచించారు. ఆర్టీసీ సంస్థ ఇప్పుడే లాభాల బాట పడుతోందని, ఇలాంటి సమయంలో సమ్మె తగదని హితవు పలికారు. అయినప్పటికీ ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని స్పష్టం చేశారు. అంతేకాకుండా.. బాగ్ లింగంపల్లిలోని కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు వందలామందితో కవాతు నిర్వహించారు. నేటి అర్ధరాత్రి తర్వాత ఏడో తేదీ తెల్లవారుజాము నుంచి సమ్మె ప్రారంభిస్తామని జేఏసీ నేతలు సర్కారు అల్టిమేటం ఇచ్చారు. ఈక్రమంలో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ సమ్మెపై స్పందించాల్సి వచ్చింది.
సీఎం వ్యాఖ్యలను పాజిటివ్ గా తీసుకుంటారా?
ఆర్టీసీ కార్మికులు సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో దీనిపై ఆయన స్పందించారు. మీ సమరం తెలంగాణ ప్రజలపైనా?.. ఎందుకు మీ సమరం… గతంలో లేని విధంగా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుకా? అంటూ ఆర్టీసీ కార్మికులకు ప్రశ్నలు సంధించారు. ప్రతీ నెలా రూ. 7 వేల కోట్లు ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలుగా ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. గత పాలకులు రూ. 8,500 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు పెట్టి వెళ్లారని ఈ సందర్భంగా వారికి ఆయన గుర్తు చేశారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు తమపై ఆరోపణలు చేస్తున్నాయన్నారు. అవన్నీ గత ప్రభుత్వంలోని వాళ్లు చెల్లించకుండా పెండింగ్ పెట్టి వెళ్లిన బకాయి లేనని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వం అంటే మేం ఒక్కరమే కాదని.. మనమంతా కలిస్తేనే ప్రభుత్వమన్నారు. మనం పాలకులం కాదని… సేవకులమని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు.. సమరమని అంటున్నారని మండిపడ్డారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులపై లేదా? అంటూ కార్మిక జేఏసీ నేతలను ఆయన నిలదీశారు. ఉద్యోగ సంఘాల నాయకులకు తాను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నానని.. ఏదైనా సమస్య ఉంటే చర్చించుకుందామని సూచించారు. ప్రజలపై యుద్ధం చేసి.. బాగుపడినవారు ఎవరూ లేరంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఉద్యోగ సంఘాల నాయకుల్లారా.. రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబం.. కుటుంబ పరువును బజారున పడేయొద్దంటూ కార్మిక సంఘాల నేతలకు ఆయన హితవు పలికారు. సీఎం వ్యాఖ్యలను ఆయా సంఘాల నేతలు పాజిటివ్ గా తీసుకుంటారా? అలా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తారా అనేది చూడాలి.
ఆర్టీసీ సంఘాల ప్రధాన డిమాండ్లు ఏంటంటే..
* ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.
* ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలి.
* రిటైర్మెంట్ వయోపరిమితిని పెంచాలి.
* 2021 పీఆర్సీలో 20-25% ఫిట్మెంట్ ఇవ్వాలి. పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి.
* ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితిని 60 ఏళ్ల నుండి 61 ఏళ్లకు పెంచాలి.
………………………………………………………