
* మరింత వెలుగొందేలా తెలంగాణ సర్కారు ఏర్పాట్లు
* రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్న “మిస్” లు
* అందాల భామల రాకతో విశ్వ వ్యాప్తి
* కాకతీయ హెరిటేజ్ టూర్ కు అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు
* కోతులు, పాముల తరలింపునకు క్యాచర్స్
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ :
అంతర్జాతీయ ఈవెంట్ కు తెలంగాణ వేదికైంది. ప్రపంచ అందాల పోటీల ప్రారంభంతో అందరి చూపూ మన రాష్ట్రంపైనే పడింది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా.. అత్యంత అట్టహాసంగా మిస్ వరల్డ్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. 110 దేశాల నుంచి సుందరీమణులు ఈ వేడుకకు హాజరయ్యారు. మే 31 వరకు హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. అందాల పోటీల వేదికపైనే కాకుండా, సుందరీమణులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తళుక్కున మెరవనున్నారు. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. తద్వారా రాష్ట్ర పర్యాటక ప్రత్యేకతలు ప్రపంచమంతా తెలిసేలా చర్యలు చేపడుతోంది. ఇదే క్రమంలో ఈనెల 14న అందాల భామలతో కాకతీయ హెరిటేజ్ టూర్ ఉండనుంది.
రారమ్మంటున్న రామప్ప
మిస్ వరల్డ్ పోటీలను అందాల ప్రదర్శనకే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని పర్యాటక, ఆధ్యాత్మిక రంగాల అభివృద్ధికి దోహదపడేలా తెలంగాణ సర్కారు ప్రణాళికలు రచించింది. తద్వారా అభివృద్ధికి బాటలు వేసేందుకు యత్నిస్తోంది. దీనిలో భాగంగా రామప్ప దేవాలయాన్ని సుందరాంగులు సందర్శించనున్నారు. అక్కడి శిల్పకళను చూసి విద్యార్థులు, స్థానికులతో మాట్లాడనున్నారు. ఇప్పటికే మిస్ ఇండియా 2023 విజేత నందిని గుప్తా ఈ ఆలయాన్ని సందర్శించారు. రామలింగేశ్వరుడికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. రామప్ప ఆలయ చరిత్రను అధికారులు ఆమెకు వివరించారు. రాజస్థాన్ కు చెందిన నందిని గుప్తా ముందుగానే రామప్ప ఆలయాన్ని సందర్శించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పర్యాటక ప్రచార వీడియోల్లోనూ ఆకట్టుకుంటోంది.
ఇప్పటికే అంతర్జాతీయ గుర్తింపు
తెలంగాణలో ములుగు జిల్లా వెంకటాపురంలో మండలంలో ఉన్న రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు పొందింది. ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు నిర్మించారు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవము రామలింగేశ్వరుడు. ఇది విష్ణువు దశావతారాలలో ఒకరైన శ్రీరాముడు కొలిచిన లింగమైన రామలింగేశ్వరుడు ప్రధాన దైవముగా ఉన్న దేవాలయము. ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి అయిన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయము తూర్పు దిశాభిముఖముగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగమున మూడు వైపుల ప్రవేశ ద్వారములు గల మహామండపం ఉంటాయి. గర్భాలయంలో ఎత్తైన పీఠముపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగము ఉంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మహామండపము మధ్య భాగమున కల కుడ్య స్తంభములు, వాటిపై గల రాతి దూలములు రామాయణ, పురాణ, ఇతిహాస గాథలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పములు కలిగి ఉన్నాయి. నీటిపై తేలియాడే ఇటుకలతో గోపుర నిర్మాణం, నిర్మాణంలో వాడిన రాళ్ళు నేటికీ రంగును కోల్పోకపోవడం వంటి ప్రత్యేకతలతో ఈ ఆలయం యునెస్కో గుర్తింపు పొందింది.
సమన్వయ సమావేశాలు
మరో రెండు రోజుల్లో రామప్ప ఆలయాన్ని ప్రపంచ సుందరీమణులు సందర్శించనున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అతి పురాతమైన ఈ ఆలయ పరిసరాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉంది. చుట్టూ గుట్టలు, అడవులు ఉండే ప్రాంతం కావడంతో వానర, పాముల సంచారం ఎక్కువ. అందాల భామల రాక నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆంధ్రా నుంచి మంకీ క్యాచర్స్ ను పిలిపించి రామప్ప పరిసరాల్లోని కోతులను అటవీ ప్రాంతానికి తరలించారు. పాములు పట్టేందుకు స్నేక్ స్నాచర్స్ అందుబాటులో ఉంచారు. హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ములుగు కలెక్టర్ దివాకర్ లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, ములుగు ఎస్పీ శబరీష్ లతో తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఎంతో ఖ్యాతి పొందిన రామప్ప ఆలయం అందాల భామల రాకతో మరింత విశ్వ వ్యాప్తం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
…………………………………………………..