
* న్యాయదేవతపై దాడి చేశారు
* దళితుడైనందకేనా..?
* జస్టిస్‌పై దాడికి బార్ అసోసియేషన్ ఆగ్రహం
ఆకేరున్యూస్ హనుమకొండ : దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి మీద మతోన్మాది చెప్పు విసిరి న్యాయ దేవత మీద దాడికి పాల్పడ్ఢాడని సీనియర్, హన్మకొండ బార్ అధ్యక్షుడు అడ్వకేట్ పులి సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఉదయం కోర్టు గేట్లు మూసి హన్మకొండ వరంగల్ బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తన మీద దాడి జరిగినా కూడా ధైర్యంగా కేసులు విచారించిన జస్టిస్ గవాయి పట్ల ప్రసంశలు కురిపించాడు. దళిత సామాజిక నేపథ్యం నుండి దేశ సర్వోన్నత న్యాయస్థానం ఛీఫ్ జస్టిస్ గా ఎదిగడాన్ని జీర్ణించుకోలేని కొన్ని దేశ వ్యతిరేక శక్తులు ఈ దాడికి పాల్పడ్డాయని అన్నారు. కేసుల విచారణ సందర్భంగా జడ్జీలు అనివార్యమైతే కొన్ని వ్యాఖ్యలు చేస్తారని, అవి వారి వ్యక్తిగతమైన అభిప్రాయాలుగా వుంటాయని, వాటిని రాద్దాంతం చేసి ఇలా దాడులకు తెగబడటం సరైంది కాదని పులి సత్యనారాయణ అన్నారు. కోర్టులు రాజ్యాంగానికి లోబడి పని చేస్తాయని ఆయన గుర్తు చేశారు. కేవలం దళితుడు కావడం వల్లనే సులువుగా దాడికి సిద్ధపడ్డారని ఆయన విమర్శించారు. గతంలో మహిళలకు, దళితులకు, బిసిలకు వ్యతిరేకంగా చాలామంది జడ్జీలు దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ మెజారిటీ ప్రజలు సంయమనం పాటించారని ఆయన అన్నారు. రిజర్వేషన్ల కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ప్రజలు ఏ జడ్జీని ఎవరూ ధూషించలేదని ఆయన అన్నారు. వరంగల్ జిల్లా బార్ అధ్యక్షుడు వల్స సుదీర్ మాట్లాడుతూ మహోన్నత వ్యక్తిత్వం గల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడిని తీవ్రంగా ఖండించారు. న్యాయవాదులు సమిష్టిగా ఈ దాడిని ఖండించాలని ఆయన కోరారు. సీనియర్ లాయర్ గంధం శివ మాట్లాడుతూ జస్టిస్ గవాయికి ఇది రెండో సారి జరిగిన అవమానం అన్నారు. సిజెఐ హోదాలో మహారాష్ట్ర సందర్శించినప్పుడు ప్రోటోకాల్ పాటించకుండా అవమానించారని, ఇప్పుడు ఏకంగా చెప్పు విసిరారని ఆయన ఆవేదన చెందారు. ఈ దాడి దేశంలోని బహుజన వర్గాల ఆత్మ మీద జరిగిన దాడి అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు సహోదర్ రెడ్డి, అంబరీష్ జయాకర్, చిల్లా రాజేంద్రప్రసాద్, జీవన్, జిలుకర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
………………………………………