
* భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణ రావు
ఆకేరున్యూస్, భూపాలపల్లి: నూతన భూ భారతి చట్టంతో భూముల హక్కులు భద్రంతో పాటు భూ సమస్యలు సత్వర పరిష్కారం జరుగుతాయని, రైతుల మేలుకోసం ప్రజాపాలనలో చారిత్రక మార్పు అని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన భూ భారతి నూతన ఆర్ ఓ ఆర్ చట్టం అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ భారతి చట్టంలోని అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత భూమి ప్రజలకు మరొక తల్లి తండ్రి అని భూమికి అన్ని హక్కులు కల్పించే విధంగా భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, రెవెన్యూ అధికారులు పనిచేయడం లేదని అసత్య ప్రచారం చేసి ప్రజల్లో అధికారులను చులకన చేసారని తెలిపారు. ధరణి వల్ల పట్టాలు కాక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో పటిష్టమైన ఉన్నపుడు పట్వారి వ్యవస్థ ఉండేదని రకం రశీదును ఆధారంగా తీసుకొని అమ్ముకున్న, కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తుల వివరాలు పహణి లో పక్కాగా నమోదు చేసేవారని అన్నారు. ప్రతి సంవత్సరం జమాబంది చేసి పట్టాకాలంలో కొనుగోలు దారు పేర్లు ఎక్కించడం వల్ల భూమి హక్కులు కల్పించారని తెలిపారు. గత ప్రభుత్వాహయంలో ధరణి పేరుతో ప్రజల భూములను దగా, దోపిడీ చేశారని, అనేక అక్రమాలు చేసి, వాళ్ళ కడుపులు నింపుకున్నారు తప్ప పేదలకు న్యాయం చేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేసి రైతులకు న్యాయం చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం, రైతులకు ఒక ఆదర్శవంతమైన చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. భూ మాత చట్టాన్ని 9 మంది సీనియర్ అధికారులతో కమిటీ వేసి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో అధ్యయనం చేసి కష్టపడి ప్రజలకు అనుకూల మైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నుకొని ప్రజల నుండి సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని, వాటిని క్రోడీకరించి ఇంకేమైనా చట్టంలో జత చేయాల్సిన విషయాలు ఉంటే జాతచేస్తామని తెలిపారు. తదుపరి మన జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని భూ భారతిలో చేర్చి రైతుకు వెసులుబాటు కల్పించే విధంగా పట్టాలివ్వాలి, హక్కులు కల్పించే విధంగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ధరణి వల్ల రైతులు కార్యాలయాలు చుట్టూ తిరిగి విసిగి వేసారి, అధికారుల మీద పెట్రోల్ పోసిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. ధరణి వల్ల ప్రజలు నానా అవస్థలు పడ్డారని తెలిపారు. 70 సంవత్సరాలు నుండి సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలు, పాస్ బుక్ రాకపోవడం వల్ల రైతు బంధు, రైతు బీమా, బ్యాంక్ రుణాలు రాక అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్ లేక పేద రైతులు అనేకమంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు..దున్నుకునే రైతులకు పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, నూతన చట్టం ప్రకారం అన్ని హక్కులు కల్పిస్తామని తెలిపారు. 30 రోజుల భూ సమస్యలు తహసిల్దార్ పరిష్కరించే విధంగా చట్టంలో పొందుపరిచినట్లు తెలిపారు. 30 రోజుల్లో తహసిల్దారు రిజిస్ట్రేషన్ చేయకపోతే ఆటోమేటిక్ గా భూ భారతిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన తెలిపారు. తహసిల్దారు మీద ఆర్డీవోకి ఆర్డిఓ మీద కలెక్టర్ గారికి కలెక్టర్ మీద ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసే అవకాశాన్ని కూడా కల్పించినట్లు తెలిపారు.
………………………………….