
* ట్రంప్‌తో భేటీ సందర్భంగా ప్రధాని మోడీ
ఆకేరున్యూస్, అమెరికా: అమెరికాలో వైట్‌హౌస్‌లో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం కీలకమైన సమావేశం జరిగింది. ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీతో ఆయన మొదటిసారి సమావేశ మయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల వాణిజ్య సంబంధాలను పెంచడం, సుంకాల సవరణ, భవిష్యత్తులో భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చలు సాగాయి. ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్ ఎప్పటికీ శాంతి వైపే ఉంటుందని, శాంతి కోసం చేసే చర్యలకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. జాతీయ ప్రయోజనాలు, శాంతి కోసం చేసే ప్రయత్నాల విషయంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఈ క్రమంలో భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. భారత్, అమెరికా సుసంపన్న ప్రజాస్వామ్య దేశాలుగా నిలవాలని, మానవాళి సంక్షేమం కోసం కలిసి పనిచేస్తే, అది ప్రపంచానికి మంచి మార్గదర్శకత్వం అవుతుందని మోదీ అన్నారు. ఎలాన్ మస్క్‌తో మోదీ బేటీ. స్పేస్, టెక్నాలజీ, మొబిలిటీ, ఇన్నోవేషన్ వంటి రంగాలలో భారత్ చేసే సంస్కరణలు, గవర్నమెంట్, మాక్సిమమ్ గవర్నెన్స్ వైపుగా చేయగలిగే ప్రయత్నాల గురించి ఎలాన్ మస్క్‌తో చర్చించానని ప్రధాని మోదీ తెలిపారు. ప్రధాని మోదీ అక్రమ వలసదారులపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసదారులకు దేశంలో ఉండే హక్కు రాదు. ఇది అంతర్జాతీయ సమస్య. ఏ దేశం అయినా తమ హోదాను పాటించాల్సి ఉంటుందని తెలిపారు. అమెరికాలో భారత రాయబార కార్యాలయాలను మరింత విస్తరించడానికి ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని భారత రాయబార కార్యాలయాల విషయంలో లాస్ఏంజెల్స్, బోస్టన్ నగరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని ప్రధాని ప్రకటించారు. కాగా ప్రధాని మోదీతో పాటు ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా పాల్గొన్నారు. అమెరికా పర్యటనకు విచ్చేసిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆత్మీయ ఆతిథ్యమిచ్చారు. అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. ఈసందర్భంగా భారత ప్రధానికి ట్రంప్ ప్రత్యేక బహుమతి అందజేశారు. తాను స్వయంగా రాసిన ’అవర్ జర్నీ టుగెదర్’ అనే పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చోటుచేసుకున్న కీలక సందర్భాలు, ప్రధాన ఈవెంట్లతో కూడిన ఫొటోబుక్ ఇది. ఇందులో ప్రధాని మోదీ 2019 నాటి అమెరికా పర్యటనలో నిర్వహించిన ’హౌడీ మోదీ’, ఆ తర్వాత 2020లో ట్రంప్ భారత్‌కు విచ్చేసినప్పుడు ఏర్పాటుచేసిన ’నమస్తే ట్రంప్’ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకంపై ’మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, యూ ఆర్ గ్రేట్’ అని రాసి ట్రంప్ సంతకం చేశారు. అనంతరం పుస్తకంలోని పేజీలను తిప్పుతూ వీరిద్దరూ ఉన్న ఫొటోలను మోదీకి ఆయన చూపించారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ‘భారత ప్రధానికి ఆతిథ్యం ఇవ్వడం చాలా గౌరవంగా భావిస్తున్నా. చాలాకాలం నుంచి ఆయన నాకు గొప్ప స్నేహితుడు. మా మధ్య మంచి అనుబంధం ఉంది‘ అని కొనియాడారు. అటు మోదీ కూడా ఆయనపై ప్రశంసలు కురిపించారు. ‘అమెరికా అధ్యక్షుడి నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే.. ఆయన దేశ ప్రయోజనాలకు అత్యున్నత ప్రాధాన్యమిస్తారు. ఇది అభినందించదగ్గ విషయం. ఆయన లాగే నేను కూడా భారత ప్రయోజనాలకే అధిక ప్రాముఖ్యతనిస్తా‘ అని భారత ప్రధాని తెలిపారు. ట్రంప్‌తో భేటీ సందర్భంగా మోదీ పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం వీరిద్దరూ సంయుక్త విూడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇరు దేశాల పరస్పర వాణిజ్య, రక్షణబంధం బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు దేశాధినేతలు తెలిపారు. అమెరికా పర్యటనను ముగించుకొని ప్రధాని మోదీ భారత్‌కు తిరుగుపయనమయ్యారు. భారత ప్రధాని మోదీని అద్భుతమైన నాయకత్వం ఉన్న వ్యక్తిగా ట్రంప్ అభివర్ణించారు. ఈ క్రమంలో భారత్‌కు మోదీ లాంటి నాయకుడు ఉండటం గర్వ కారణమని తెలిపారు. చాలా ఏళ్లుగా మోదీ తనకు గొప్ప స్నేహితుడన్న ట్రంప్.. ఆయనను కలవడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. భారత్‌తో మా స్నేహబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందన్నారు. త్వరలో భారత్‌తో ఒక భారీ వాణిజ్య ఒప్పందం జరగనుందని, భారత్, అమెరికా కలిసి పనిచేస్తే, ప్రపంచం ఒక గొప్ప శక్తిగా మారుతుందని వెల్లడిరచారు ట్రంప్. ఈ సందర్భంగా ట్రంప్ ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగించడానికి తన కృషి కొనసాగిస్తున్నట్లు తెలిపారు. తాను శాంతి కోసం పనిచేస్తున్నానని, గత పాలకుల కారణంగా అమెరికా పాలన గాడి తప్పిందన్నారు. ఇప్పుడు అమెరికాను తిరిగి గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నానని ట్రంప్ అన్నారు.
………………………………..