
* పైరసీ వల్ల సినిమా ఇండస్ట్రీకి 22వేల కోట్ల నష్టం
* 24 గంటలూ స్క్రీన్స్ ను వాచ్ చేసే భద్రత అవసరం : సీవీ ఆనంద్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద సినీ పైరసీ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. హార్డ్ డిస్క్ లు, సీక్రెట్ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. జూలై 3న వనస్థలిపురానికి చెందిన కిరణ్ ను అరెస్ట్ చేశారు. కిరణ్‌ను కస్టడీకి తీసుకున్న పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. దుబాయ్, నెదర్లాండ్స్, మయన్మార్ కేంద్రంగా ముఠా కార్యకలాపాలు చేపడుతున్నట్లు గుర్తించారు. శాటిలైట్ కంటెంట్ ఐడీ, పాస్ వర్డ్ లను క్రాక్ చేస్తున్న ముఠాను గుర్తించారు. ఏజెంట్లకు టికెట్లు బుక్ చేసి సీక్రెట్‌గా థియేటర్లలోనే రికార్డింగ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ కాకముందే సర్వర్లను హ్యాక్ చేసి వీడియోలను గేమింగ్సైట్లలో అప్ లోడ్ చేస్తున్నారు. పాప్ కాన్ డబ్బాల్లో కెమెరాలు పెట్టి : చొక్కా జేబు, పాప్ కాన్ డబ్బా, కోక్ టిన్లలో కెమెరాలు పెట్టి చిత్రీకరిస్తున్నారు. ఏజెంట్లకు క్రిప్టో కరెన్సీ రూపంలో నిందితులు కమీషన్లు ఇస్తున్నారు. కేవలం తెలుగు సినిమాలే కాదు, తమిళ్, మళయాళం, హిందీ సినిమాలపై నేరగాళ్లు ప్రత్యేక దృష్టి పెట్టారు.
రెండు రకాలుగా పైరసీ
దీనిపై కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ సినిమా నిర్వాహకులు, నిర్మాతలు భద్రతపై కూడా తగిన దృష్టి సారించాలన్నారు. ఖర్చు అయినప్పటికీ 24 గంటలూ స్క్రీన్స్ ను వాచ్ చేసే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఇన్ని రోజులూ థియేటర్లలోనే సిబ్బంది చేశారో, ఎవరో చేశారో అనుకునే వారని, అలా కాదని బయట నుంచే పైరసీకి మాట్లాడుతున్నారని ఆనంద్ తెలిపారు. సినిమా పైరసీ రెండు రకాలుగా జరుగుతోందని మొదటిది థియేటర్లకు వెళ్లి రికార్డు చేయడం, రెండోది సర్వర్లు హ్యాక్ చేసి వీడియోలు లీక్ చేయడం అని ఆనంద్ వివరించారు. పైరసీ వల్ల సినిమా ఇండస్ట్రీకి 22వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. తెలుగు ఇండస్ట్రీకి గతేడాది రూ.3,500 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. పైరసీ ముఠాకు ఆన్ లైన్ బెట్టింగ్ ముఠాలు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. కీలక ముఠా గుట్టును రట్టు చేసిన సైబర్ క్రైం పోలీసు టీమ్ ను అభినందించారు.
…………………………………..