
* మహారాష్ట్రలో తగిన బుద్ధి చెప్పారు
* మహబూబాబాద్ మహాధర్నాలో మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజం
ఆకేరున్యూస్, హైదరాబాద్: అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డి (REVANTHREDDY) కి రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. గిరిజన, దళిత, పేద రైతులకు మద్దతుగా మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మహాధర్నాలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. మహారాష్ట్రకు పోయి కూడా ఆడబిడ్డలను మోసం చేసే ప్రయత్నం చేస్తే అక్కడి ఆడబిడ్డలు బుద్ధి చెప్పారని తెలిపారు. నేను ఇక్కడికి వస్తుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతమంటున్నారని కేటీఆర్ తెలిపారు. నేను డీజీపీ, ఎస్సీ గారిని అడుగుతున్నా.. రాళ్లతో కొడతామంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసులు మా మీద మాత్రమే పెడుతారా? కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద కేసులు ఉండవా? అని నిలదీశారు.
మా గిరిజన రైతుల కోసం కదులుతూ మానుకోటలో ధర్నా చేస్తామంటే లగచర్లలో జరిగిన సంఘటనకు మానుకోటలో ధర్నా ఎందుకు అని డీజీపీ ప్రశ్నించారని.. కొడంగల్ రైతుల కోసం ఒక్క మానుకోటలోనే కాదు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ దళితులు, బీసీలు, గిరిజనులు ఉన్నారో అక్కడ ధర్నా చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. మేము కేసీఆర్ తయారు చేసిన దళం.. భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మానుకోట రాళ్ల మహత్మ్యం ఏందో తెలంగాణను అడ్డుకున్న వాళ్లందరికీ తెలుసన్నారు.ఇవాళ మీరు పర్మిషన్ ఇవ్వకుంటే హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకున్నామని అన్నారు. ఈ మహా ధర్నాకు వెయ్యి మంది అనుకుంటే 25 వేల మంది వచ్చారని.. అంటే ప్రభుత్వం మీద ఎంత కోపం, వ్యతిరేకత ఉందో ఈ మానుకోట మహాధర్నా చూస్తే అర్థమవుతోందని అన్నారు.
……………………………………..