
* పొట్ట, వెన్నులో తీవ్ర గాయాలతో విలవిలలాడి..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నాంపల్లిలోని ఓ అపార్టమెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలుడు ప్రాణాలతో పోరాడి ఓడిపోయాడు. లిఫ్ట్ కు , గోడకు మధ్య ఇరుక్కుపోయి పొట్ట, వెన్నులో తీవ్ర గాయాలతో విలవిలలాడిన ఆ పసివాడు మృతి చెందాడు. నాంపల్లి శాంతినగర్(Nampalli Shanthi nagar)లోని హాకీ గ్రౌండ్ ఎదురుగా ఉన్న మఫర్ అపార్ట్మెంట్ లిఫ్టులో అర్నవ్ అనే ఐదు సంవత్సరాల బాలుడు ఇరుక్కున్నాడు. నాలుగో అంతస్తులో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు సమాచారం అందించడంతో నాంపల్లి ఎమ్మెల్యే మహ్మద్ మజీద్ హుస్సేన్(Mla Masidhussain) హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు . పోలీసుల సహకారంతో 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. 108 ఈఎంటి తజుద్దీన్, పైలెట్ సురేశ్ కలిసి బాలుడిని లిఫ్టులో నుంచి తీసుకుని సిపిఆర్ చేస్తూ నీలోఫర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. నీలోఫర్(NiloFer)డాక్టర్స్ చికిత్స అందిస్తూ బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. నిన్న రెండున్నర గంటలపాటు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలుడు అర్నవ్ నరకయాతన అనుభవించాడు. పొత్తికడుపు నలిగిపోయిందని, ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగిందని.. ఆపరేషన్ చేసినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదని, బాలుడు మరణించాడని డాక్టర్స్ తెలిపారు. బాలుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి(Osmania Hospital)కి తరలించారు. లిఫ్టులో 2గంటలకు పైగా ఇరుక్కుని పోయి ఉండటం కారణంగా ఆక్సిజన్ అందక, రక్తప్రసరణ జరగకపోవడంతో అవయవాలు దెబ్బతిన్నాయని నిలోఫర్ వైద్యులు పేర్కొన్నారు. చికిత్స చేసినప్పటికీ బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిస్థితి చేయి దాటిందని వైద్యులు తెలిపారు.
…………………………………….