
* ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. లక్ష్మణ్
ఆకేరున్యూస్, సిద్దిపేట: మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని బీజేపీ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డ్ మెంబర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.లక్ష్మణ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని లక్ష్మణ్ అన్నారు. సిద్దిపేటలో లక్ష్మణ్ పర్యటించిన సందర్భంగా లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ ఒక వర్గానికి, సమాజానికి చెందిన వారు కాదు.. ప్రజలందరి మనిషి అన్నారు. మోదీపై గతంలో రాహుల్ గాంధీ కూడా ఇలాగే అవాకులు, చెవాకులు పేలారని.. రాహుల్‌కు పట్టిన గతే రేవంత్‌కు పట్టడం ఖాయమని హెచ్చరించారు. తెలంగాణలో బీసీ కుల గణన తప్పుల తడకగా మారిందని విమర్శించారు. మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలకు నిదర్శనం మైనార్టీలతో కూడిన బీసీ కుల జాబితా అన్నారు. ముస్లింలను బీసీలో చేర్చి.. ఓట్ల కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు. మత ప్రాతపదికన రిజర్వేషన్లను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన గ్యారెంటీలకు తూట్లు పొడిచారని.. రాష్ట్రంలో ప్రజలు నిరాశతో ఉన్నారన్నారు. మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని.. ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్‌గా భావించి ప్రభుత్వానికి కళ్లెం వేయాలని అన్నారు.
……………………………………….