
పొంగులేటి శ్రీనివాసరెడ్డి
* లబ్ధిదారులకు పారదర్శకంగా ఎంపిక చేశాం
* బాలసముద్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఆకేరు న్యూస్, హనుమకొండ : పేదల ముఖంలో నవ్వు చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశామని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (PONGULETI SRINIVAS REDDY) అన్నారు. హనుమకొండ బాలసముద్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడారు. పార్టీలకు అతీతంగా పేదవాడైతే చాలు.. ఇల్లు ఇవ్వాలని ఇవ్వాలని అధికారులకు చెప్పామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి విడతలో 4.50లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, 6.50లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో 9 రోజుల్లోనే రూ.9వేల కోట్లు జమ చేశామని వెల్లడించారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం వేల కోట్ల కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని, నిర్మించిన ప్రాజెక్టు మూడేళ్లకే కూలడంతో, నిర్మాణంలో జరిగిన అక్రమాలను విచారణ కమిషన్ బయటపెట్టిందని ఉద్ఘాటించారు. బీసీలకు రిజర్వేషన్లను పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమోదించలేదని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లను కొంత మందికే ఇచ్చిదని ఆయన అన్నారు. పదేళ్లపాటు ఎవరికీ రేషన్ కార్డులు ఇవ్వలేదని అన్నారు.
………………………………………………..