* డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఆకేరున్యూస్, హైదరాబాద్: రైతు భరోసా ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామన్నారు. సచివాలయంలో రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్ అధ్యక్షతన మంత్రులు, కమిటీ సభ్యులైన తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. రానున్న యాసంగి పంటకు రైతు భరోసా అందజేసేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై రెండు గంటల పాటు సమావేశమయ్యారు. రైతుబంధు పథకం ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు అందించిన తీరు.. కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన సమయంలో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అధికారులు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు.
ఎన్ని ఎకరాలకు రైతు భరోసా అమలు చేయాలనే విషయంపై కేబినెట్ సబ్ కమిటీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ట్యాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులకు రైతుభరోసా అనర్హులుగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోసారి రైతు భరోసాపై సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం.. కాగా, సబ్‌కమిటీ భేటీ అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తులతో పండిన పంట చేతికి వస్తుందో రాదో అనే భయాలు.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. అందుకే పంటల బీమా పథకం కింద ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు చెల్లిస్తుందని తెలిపారు. పంటలకే కాదు రైతు కుటుంబానికి భరోసాగా నిలిచేందుకు రైతు బీమా పథకం కింద రైతుల పక్షాన ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందన్నారు.
……………………………………..