ఆకేరున్యూస్, హైదరాబాద్: సిరిసిల్ల: తీసుకున్న డబ్బులివ్వడం లేదని మహారాష్ట్రకు చెందిన ఓ కాంట్రాక్టర్ బరితెగించాడు. ఏకంగా మేస్త్రీ తల్లిని బలవంతంగా తమ వెంట తీసుకెళ్లాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగింది. వేములవాడ అర్బన్ మండలం కొడుముంజకు చెందిన పల్లపు శ్రీను మేస్త్రీగా పనిచేస్తున్నాడు. కాగా, మహారాష్ట్రకు చెందిన లాలు దేవకర్ అండ్ టీం కర్ణాటకలో చెరుకు తోటలను కోసే పనులను కాంట్రాక్టు తీసుకున్నారు. ఇందుకోసం కూలీలు అవసరం ఉండగా.. శ్రీను, అతడి సోదరుడిని సంప్రదించారు. ప్రస్తుతం శ్రీను, అతని సోదరుడు ఛత్తీస్‌గఢ్‌లో కూలీ పనులు చేస్తున్నారు. అయితే లాలు దేవకర్‌కు సంబంధించి కర్ణాటకలోని చెరుకు తోట కొట్టడానికి కావాల్సిన కూలీల కోసం ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కూలీలతో శ్రీను ఒప్పందం కుదిర్చాడు.
దీనికి మధ్య వర్తిత్వంగా శ్రీను వ్యవహరించాడు. ఇందుకోసం లాలు దేవకర్ రూ.3.80 లక్షలను కూలీలకు చెల్లించాడు. అయితే కూలీలు పనులకు రాకపోవడంతో లాలు దేవకర్‌కు, కొడుముంజకు చెందిన శ్రీను, అతడి సోదరునికి మధ్య వివాదం చోటుచేసుకుంది. తన డబ్బులు తిరిగి చెల్లించాలని లాలు దేవకర్ శ్రీను అతడి సోదరుడిపై ఒత్తిడి చేయడంతో పాటు పలుమార్లు చర్చలు జరిగాయి. ఈ క్రమంలో లాలు దేవకర్, మరికొంత మంది కొడుముంజ ఆర్ అండ్ ఆర్ కాలనీలోని శ్రీను ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న శ్రీను తల్లి పల్లపు భీమా బాయిని బలవంతంగా కారులోకి ఎక్కించి కిడ్నాప్‌కు పాల్పడ్డారు. డబ్బులిచ్చి తల్లిని తీసుకెళ్లాలంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
……………………………………….