
* హత్యను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ సర్కారు
* నిఘా వర్గాల నుంచి సీఎంఓ ఆరా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కేసు వేసిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి(47) దారుణ హత్యకు గురికావడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయనకు హత్యకు కుటుంబ తగాదాలు కారణమా..? ఈ కేసుతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే చర్చ జరుగుతోంది. లింగమూర్తి హత్యను తెలంగాణ సర్కారు సీరియస్(Telangana Government Serious)గా తీసుకుంది. హత్యకు గల కారణాలపై నిఘా వర్గాల నుంచి సీఎంఓ వివరాలు సేకరిస్తోంది. రాజలింగమూర్తి వార్డు మాజీ కౌన్సిలర్ అయిన నాగవెళ్లి సరళ భర్త. ఆమె 2019లో జరిగిన పురపాలక ఎన్నికల్లో భూపాలపల్లి (Bhupalapalli)లోని 15వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున కౌన్సిలర్‌గా గెలుపొందారు. కొద్ది నెలల తర్వాత నాగవెళ్లి సరళను బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ నెల 19వ తేదీన రాజలింగమూర్తి తన స్వగ్రామం జంగేడు శివారు పక్కీరుగడ్డలో సోదరుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి బైక్‌పై భూపాలపల్లికి తిరిగి వస్తున్నాడు. సరిగ్గా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎదురుగా రోడ్డును దాటుతున్న క్రమంలో 4 నుంచి ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు మంకీ క్యాపులను ధరించి ఆయన్ను చుట్టుముట్టారు. ఒక్కసారిగా కత్తులు, గొడ్డళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. తలకు బలమైన గాయంతో పాటు కత్తిపోట్ల కారణంగా అతడి ప్రేగులు బయటకు వచ్చేశాయి. స్థానికులు వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఆయన మృతికి భూ తగాదాలా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ కేసు విషయంలో నేరుగా సీఎంఓ (CMO) రంగంలోకి దిగడం ఉత్కంఠను రేపుతోంది.
……………………………………….