* తెలంగాణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం.. విద్యార్థులు-యువకులు, ఉద్యోగులు-మహిళలు, మేధావులు, కవులు-కళాకారులు, సకలజనులు ఉద్యమించి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చుకున్న రోజు.. ఇది మనందరం గర్వించదగిన రోజు. ఈ సందర్భంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా… అంటూ ఆవిర్భావ దినోత్సవాన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. రాష్ట్ర ప్రజల కలను నిజం చేసిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, అందుకే పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. తాము బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నం మొదలు పెట్టామని తెలిపారు.
తెలంగాణ సమాజం సహించదు..
కట్టుబానిసత్వాన్ని, వెట్టిచాకిరీని తెలంగాణ సమాజం సహించదని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ప్రజా ప్రభుత్వంలో ప్రజల ఆలోచనలే తమ ఆచరణగా ముందుకు వెళుతున్నామన్నారు. పదేళ్లలో నిర్వీర్యమైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నామన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం. సమాచార కమిషనర్లను, లోకాయుక్త, హెచ్ ఆర్సి (HRC) సభ్యులను నియమించుకుని, వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.
మహిళలు, రైతుల శ్రేయస్సే లక్ష్యం
కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే రూ.21వేల కోట్లు సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశామన్నారు. దేశంలో అదానీ, అంబానీలతో పోటీ పడేలామహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయించామన్నారు. తాము తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు అంతర్జాతీయ మార్కెట్లో మహిళా సంఘాలు పోటీ పడేలా హైటెక్ సిటీ పక్కన శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ఏర్పాటు చేశామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాదు, ఆ బస్సులకు వారిని యజమానులుగా మార్చే కార్యక్రమాలను చేపట్టామయన్నారు. ఇప్పటికే 150 బస్సులను వారికి అందజేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలు మహాలక్ష్మిలా మారి సగర్వంగా నిలబడాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. అలాగే, రాష్ట్రానికి రైతే వెన్నెముక అని, ఇచ్చిన మాట ప్రకారం కేవలం ఎనిమిది నెలల్లో 25, 35,964 మంది రైతులకు రూ.20,617 కోట్లు రుణమాఫీ చేసి అన్నదాతల రుణం తీర్చుకున్నామన్నారు. రైతులకు 24గంటల ఉచిత విద్యుత్, రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.12వేలకు పెంచామని వివరించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఏడాదికి రూ.12వేలు అందిస్తున్నాం. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూ భారతి-2025 చట్టాన్ని తీసుకువచ్చామన్నారు.
యువతే మన భవిష్యత్
అందుకే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన16నెలల్లోనే 60వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, నియామక పత్రాలను అందించామని, డీఎస్సీ ప్రకటించి 10వేల మందికి పైగా ఉపాధ్యాయులను నియమించామని వివరించారు. అంతర్జాతీయ పెట్టుబడులు రావడంతో ప్రైవేట్ రంగంలో లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య, వైద్య రంగాల్లో ప్రక్షాళనకు విప్లవాత్మక చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే గతంలో ఎప్పుడూ లేని విధంగా డైట్ చార్జీలను 40శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులంతా ఒకే ప్రాంగణంలో చదువుకునేలా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. తొలి దశలో రూ.11,600 కోట్లతో 58 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం చేపట్టామని వివరించారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు 30 ఎకరాల్లో రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు.
కులగణనతో దేశానికే ఆదర్శం
కులగణన ద్వారా దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపామన్నారు. శాస్త్రీయంగా కులగణన నిర్వహించింది. బీసీల లెక్క 50.36 శాతంగా తేల్చాం. దానికి అనుగుణంగా బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే నిర్ణయం తీసుకున్నాం. శాసనసభ,శాసన మండలిలో బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించుకున్నాం. తెలంగాణ బాటలోనే కేంద్ర ప్రభుత్వం జనగణలో కులగణన చేపట్టేందుకు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై మా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఎస్సీ ఉప కులాను మూడు గ్రూపులుగా విభజించి చట్టబద్దత కల్పించాం.ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 4 ను తెలంగాణ సోషల్ జస్టిస్ డే గా జరపాలని నిర్ణయించామని తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా పేదల ఆకలి తీర్చడమే కాదు, వారు ఆత్మగౌరవంతో జీవించేలా నిలపడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందులో భాగంగానే సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించామని తెలిపారు.
అభివృద్ధి వైపు అడుగులు
అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. 30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం. ఏఐ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఫార్మా సిటీలతో పాటు లైఫ్ సైన్సెస్, హెల్త్ సిటీలను ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో మౌలిక సదుపాయాలలో భాగంగా విమానాశ్రయాల సంఖ్యను పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే మామునూరు విమానావ్రయం పునరుద్ధరణకు అన్ని అనుమతులు సాధించామని తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధి లక్ష్యంగా దాదాపు 18వేల కోట్ల రూపాయలతో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాం. రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లు నిర్మించబోతున్నాం. రీజనల్ రైల్ తో పాటు మెట్రో రైల్ విస్తరణ చేపడుతున్నాం. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రూ.24వేల కోట్లతో మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టును చేపడుతున్నామన్నారు.
……………………………………………….
