
తెలుగు రాష్ట్రాల్లో.. మరో 5 రోజుల పాటు వర్షాలు.
* తెలుగు రాష్ట్రాల్లో స్తంభించిన జనజీవనం
* మరో ఐదు రోజులూ భారీ వర్షాలు
ఆకేరు న్యూస్ డెస్క్ : గత పది పదిహేను రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పడుతున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. పలు జిల్లాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరింది. పలు చోట్ల వాగులు పొంగిపొర్లుతున్నాయి. రాకపోకలు బంద్ అయ్యాయి. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో 17.9 సెం.మీ భారీ వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లాలోని గౌరారంలో రికార్డ్ స్థాయిలో 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.ఇటు హైదరాబాద్‌లో నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు ఎడతెరపిలేకుండా వర్షం కురిసింది. అలాగే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షం నమోదు అయ్యింది. నిన్న అత్యధికంగా హైదర్‌నగర్‌లో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. మళ్లీ ఐదు రోజులుహైదరాబాద్ లో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఎస్సారెస్పీకి భారీగా వరదనీరు..
శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో కి 1 లక్షకుపైగా క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరినట్లు ఇరిగేషన్
అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1088.70 అడుగులకు చేరింది. ఈ సందర్భంగా 10 గేట్లు ఎత్తి నీటిని వదలడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. గేట్లు ఎత్తి వేయనున్న దృష్య్ట దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆంధ్రాలో…
దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరప్రాంతంపై అల్పపీడనం కొనసాగుతున్నందున ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించారు. ఇప్పటికే విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు ప్రకటించారు. , కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
……………………………………