
* ఖిలాషాపూర్ కోట చరిత్రను కాలగర్భంలో కలిపే కుట్ర చేశారు
* సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: గత బీఆర్ ఎస్ ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర కాలగర్భంలో కలిపేందుకు కుట్ర చేసిందని,మైనింగ్ పేరుతో ఖిలాషాపూర్ కోటను ధ్వంసం చేసే కుట్ర చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహం ఏర్పాటుకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ ఖిలాషాపూర్ కోటను చారిత్రిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని రేవంత్ గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు ట్యాంక్ బండ్ ప్రాంతంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.బహుజనుల సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం దేశంలో ఏ రాష్ట్రం చేయని పనిని తెలంగాణలో తాము చేసి చూపించామంటూ గర్వంగా చెప్పారు. కులగణన ద్వారా బహుజనుల సంఖ్య 56.33 శాతంగా ఉందని తేల్చామని తెలిపారు.
రిజర్వేషన్లను అడ్డకుంటున్నారు
రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బిసీ రిజర్వేషన్లను అడ్డుకుంటోందని సిఎం రేవంత్ అన్నారు, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చేస్తున్నారంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్లో బీసీల్లో ముస్లింలకు రిజర్వేషన్లు తొలగించగలరా? అంటూ ఆయన బీజేపీ నాయకులను ప్రశ్నించారు. బహుజనులంతా ఉన్నత చదువులు చదివి రాజ్యాధికారం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. విగ్రహాలు అనేవి వర్ధంతులు, జయంతుల కోసం కాదని, వారి స్ఫూర్తిని రగిలించిందుకే అని రేవంత్ అన్నారు. అందుకే రాష్ట్రానికి గుండెకాయ లాంటి సచివాలయం సమీపంలో పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు రేవంత్.
……………………………..