
* సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: పద్మశాలిలు ఆర్థిక, రాజకీయ, ఉపాధి, ఉద్యోగ పరంగా అభివృద్ధి చెందేలా క్రియాశీలక నిర్ణయాలు తీసుకునేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మా ప్రభుత్వం రైతన్నలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో నేతన్నలకూ అంతే ప్రాధాన్యత ఇవ్వాలన్న విధానపరమైన నిర్ణయంతో పని చేస్తున్నదన్నారు. ఇవాళ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అఖిల భారత పద్మశాలి మహాసభకు ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ పద్మశాలీ సంఘ నాయకులు, తదితరులు హాజరై ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. పద్మశాలీలు ఆత్మగౌరవంలోనే కాదు, త్యాగంలోనూ ముందుటారన్నారు. టైగర్ నరేంద్ర త్యాగం లేకుండా మలిదశ తెలంగాణ ఉద్యమం ముందుకు సాగలేదనేది నిజమన్నారు. కాంగ్రెస్ పార్టీ పద్మశాలీలను రాజకీయంగా ప్రోత్సహించిందన్నారు. ఏ మాత్రం అవకాశం వచ్చినా పద్మశాలీలన అభ్యున్నతే లక్ష్యమే మా ప్రభుత్వం విధానమన్నారు. మేము అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తెలంగాణలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) సాధించడమే కాకుండా దానికి కొండా లక్ష్మణ బాపూజీ పేరు పెట్టుకున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆదర్శమూర్తిగా నిలిచిన లక్ష్మణ్ బాపూజీ పేరును ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి పెడతామని ప్రకటించారు. తెలంగాణ సాధన, తెలంగాణ నిర్మాణంలో పద్మశాలీలది గొప్ప పాత్ర అని కొనియాడారు. అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించి చూపిస్తానన్నారు. ఈ రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు ఏడాదికి రెండు చీరలు ఇచ్చేలా ఒక కోటి 30 లక్షల చీరలు పద్మశాలీలకు బతుకమ్మ చీరలను ఆర్డర్ ఇచ్చామన్నారు. మహారాష్ట్రలోని షోలాపూర్ లో మన పద్మశాలీలు చాలా మంది ఉన్నారని అక్కడ పద్మశాలీ ఆత్మగౌరవాన్ని నిలిపేలా మార్కండేయ భవనం నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చి సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పద్మశాలిల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నానని సీఎం చెప్పారు. పద్మశాలీల అభ్యున్నతి కొరకు, ఆర్థికంగా ఎదగడానికి గాను తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పద్మశాలి కార్పొరేషన్ ను ఏర్పాటుచేసి రాష్ట్రంలోని పద్మశాలి లందరికీ భరోసా కల్పించిన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ‘‘శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి’’ గారికి ఈ తెలంగాణ పద్మశాలి మహాసభ ద్వారా గ్రేటర్ వరంగల్ నగర మేయర్, మాజీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి పద్మశాలీలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. అంతేకాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో నిర్వహించనీ విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ కుల గణనను చేపట్టి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చినందులకు కూడా సీఎంకు గుండు సుధారాణి ధన్యవాదాలు తెలిపారు.
…………………………………………