
* త్వరలో ఎంజీఎం అభివృద్ధిపై మంత్రులతో సమీక్ష
* మహిళా ఉద్యోగులకు పనిభారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటా..
* వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి
ఆకేరున్యూస్, వరంగల్: ఎంజీఎంలో మహిళా ఉద్యోగుల సేవలు మరువలేనివని, వారికి పనిభారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఎంజీఎంలో శనివారం ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఎంజీఎం సమావేశ మందిరంలో జరిగిన ఈ వేడుకలో ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఆరోగ్య చికిత్సలో కీలక భూమిక పోషిస్తున్న ఎంజీఎం ఆసుపత్రిలో నిత్యం వస్తున్న రోగులకు వైద్య సేవలు అందిస్తున్న మహిళా డాక్టర్లకు, నర్సులకు, ఆయాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతానికి ఉద్యోగుల కొరత ఉందని తన దృష్టికి వచ్చిందని, రానున్న కొద్ది రోజుల్లో జిల్లా మంత్రి కొండా సురేఖ, ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ఎంజీఎం అభివృద్ధికి నిధులు విడుదలకు కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల నియమావళి ముగిసిన తరుణంలో ఈ మధ్య కాలంలోనే ఎంజీఎం ఆసుపత్రి అభివృద్ధి, వైద్య సిబ్బంది నియామకం కోసం మంత్రులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని ఎమ్మెల్యే నాయిని తెలిపారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులతో కలిసి ఎమ్మెల్యే నాయిని కేక్ కట్ చేసి వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సాంబశివరావు, ఐఎన్టీయూసీ జిల్లా చైర్మన్ బత్తిని సుదర్శన్ గౌడ్,ఎమ్మార్వో డా.శ్రీనివాస్, డా.వెంకట్, ప్రేమలత, నర్సింగ్ సూపరిండెంట్ అర్పిని ఆనంద్, ఎంజీఎం బ్రాంచ్ అధ్యక్షులు శాంతి కుమారి, ప్రధాన కార్యదర్శి ప్రీతి సజని, కార్యనిర్వాహక అధ్యక్షులు సాల్మా కార్తీక్, సుజీవన్, తిరుమల, సరళ తదితరులు పాల్గొన్నారు.
…………………………….