
* వారిని పిలుస్తూ.. స్పందన తెలుసుకునే ప్రయత్నం
* 13.5 కిలోమీటర్ల వరకూ వెళ్లగలిగిన సహాయక బృందాలు
* 14వ కిలోమీటరు వద్దకు వెళ్లేందుకు మట్టి, నీళ్లు అడ్డంకి
* ఎస్ఎల్బీసీలో ముమ్మరంగా సహాయక చర్యలు
* రంగంలోకి ఆర్మీ బృందం
ఆకేరు న్యూస్ ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ :
నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం (SLBC TUNNEL INCIDENT) దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ప్రమాదంలో 8 మంది ఉద్యోగులు, కార్మికులు టన్నెల్ లో చిక్కుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సైతం సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలపై ఆరా తీశారు. ప్రస్తుతం టన్నెల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో 24 మందితో కూడిన ఆర్మీ బృందం (ARMY TEAM)కూడా పాల్గొన్నది. 130 మంది ఎన్డీఆర్ ఎఫ్, 24 మంది హైడ్రా బృందం, మరో 24 మందితో కూడిన సింగరేణి కాలరీస్ రెస్క్యూటీం సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఘటనాస్థలంలో కూలిన మట్టి, నీటితో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.
ఆ అరకిలోమీటరే పరీక్ష
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కూలగా 13.5 కిలోమీటర్ల వరకు సహాయక బృందాలు వెళ్లగలిగాయి. మరో అర కిలోమీటరు వెళ్లేందుకు మట్టి, నీళ్లు అడ్డుగా ఉన్నాయి. అడ్డంకులను అధిగమించి ఘటనాస్థలానికి చేరుకునేందుకు ఆయా బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ (TBM) నీటి ఉధృతికి 80 మీటర్లు వెనక్కి వచ్చింది. దీంతో ఆ ప్రదేశంలో 200 మీటర్ల గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్‌లోనే 8 మంది చిక్కుకున్నారని భావిస్తున్నారు. చిక్కుకున్న వారిని పిలుస్తూ, వారి స్పందన కోసం రెస్క్యూ బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ వెనుక భాగం సహాయక బృందాలకు కనిపించింది. పైకప్పు కూలడంతో మట్టిలో కూరుకుపోయింది. ఆ మిషన్ ముందు భాగంలో 8 మంది చిక్కుకున్నట్లు ఆ బృందాలు భావిస్తున్నాయి. 8 మందిలో ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు టీబీఎం ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(UTHAMKUMAR REDDY), హైడ్రా కమిషనర్ రంగనాథ్ (RANGANATH) ఎస్ ఎల్బీసీ వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
…………………………………..