* సర్కారు నడుపుతున్నరా.. సర్కాస్ నడుపుతున్నారా..
* కేసీఆర్ అప్పజెప్పిన 18 వేల కోట్లు తప్ప రూపాయి అయినా పెంచిర్రా..?
* పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన అప్పు 4 లక్షలా 17 వేల కోట్లు మాత్రమే
* బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆర్థిక వనరులకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలపై బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో స్పందించారు. అందాల పోటీలు నిర్వహించేందుకు రూ.250 కోట్లు ఉన్నాయి కానీ.. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెన్షన్లకు, బెనిఫిట్స్‌కు పైసల్లేవా..? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సర్కారు నడుపుతున్నరా.. సర్కాస్ నడుపుతున్నారా.. అని రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అప్పజెప్పిన 18 వేల కోట్లు తప్ప మీ ప్రభుత్వం రూపాయి అయినా ఆదాయం పెంచిందా అని ప్రశ్నంచారు. పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ (BRS) చేసిన అప్పు 4 లక్షలా 17 వేల కోట్లు మాత్రమే చేసిందని, ఇవిగో లెక్కలు అని ఆధారాలతో చెప్పే ప్రయత్నం చేశారు. అప్పులపై ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు.
సర్కారుపై చర్చ మొదలైంది..
కేసీఆర్ (KCR) ఉన్నప్పుడు కరెంట్ మంచిగా ఉండే ఇప్పుడు ఎందుకు లేదు అని ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. రైతుబంధు సమయానికి పడుతుండే అని అనుకుంటున్నారు. ఆసరా పెన్షన్లు ఎందుకు ఎగ్గొడుతుండు అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు రాష్ట్రం పురోగమనంలో ఉంటే ఇప్పుడు ఎందుకు తిరోగమనంలో ఉంది అని ప్రశ్నించుకుంటున్నారు. ఇది నాయకత్వం లోపం కాదా..? ఇది మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పెట్టిన శాపం. మార్పు పేరుతో చేసిన దుర్మార్గం ఇది. పరిపాలిస్తున్న రాష్ట్రానికి శాపనార్థాలు పెట్టిన సీఎం ఈ దేశంలో ఎవరూ లేరు. ఎయిడ్స్ పెషేంట్ అంటవి. క్యాన్సర్ పెషెంట్ అంటివి.. ఆఖరికి నిన్న దివాళా తీసింది అని అంటివి. రాష్ట్రం పాలిట నీ మాటలు శాపంగా మారాయని రేవంత్ రెడ్డి(REVANTHREDDY)పై కేటీఆర్ ధ్వజమెత్తారు. 2014 లెక్కలు తీసుకుంటే.. రాష్ట్ర ఆదాయం 51 వేల కోట్లు అని, తాము దిగిపోయిన నాడు ఆదాయం 2 లక్షల 16 వేల 567 కోట్లు అని వివంరించారు. మరి రాష్ట్ర ఆదాయం పెరగలేదా..? అన్నారు.
17 నెలల కాలంలో నువ్వు ఏం చేస్తున్నవ్ రేవంత్..
పదేండ్ల కాలంలో 4 లక్షల 17 వేల కోట్ల మాత్రమే చేశాం. ఏడాదికి 40 వేల కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చెల్లించె అప్పు లక్షా 15 వేల 599 కోట్లు. 4 వేల కోట్ల నెలసరి ఆదాయంతో మాకు అప్పజెపితే.. తిరిగి మేం 2023 డిసెంబర్లో 18 వేల కోట్లతో అప్పజెప్పాం.. నిన్న 2025 మే నెలలో ఏం మాట్లాడుతున్నారు. 18 వేల కోట్లే వస్తుందని అంటున్నరు. మరి ఈ 17 నెలల కాలంలో నువ్వు ఏం చేస్తున్నవ్.. నీ ప్రభుత్వం ఏం జేస్తుంది. ఎందుకు ఆదాయం పెంచలేకపోయారు. కేసీఆర్(KCR) అప్పజెప్పిన 18 వేల కోట్లు తప్ప నీ ప్రభుత్వం రూపాయి అయినా ఆదాయం పెంచగలిగిందా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. తలసారి ఆదాయంలో కేసీఆర్ రాష్ట్రాన్ని నంబర్ వన్ చేశారని తెలిపారు.
………………………………………
