
– బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి స్కీము స్కామే
– కౌశిక్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లపై ఆరోపణలను నిరూపించాలి
– హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్.
ఆకేరు న్యూస్, కమలాపూర్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం స్కీములు ప్రవేశ పెడుతుంటే వాటిని స్కాములుగా ఆరోపణలు చేస్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాటిని నిరూపించాలని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ అన్నారు.సోమవారం కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు ప్రణవ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… స్కాములు చేసే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల పై చేసిన ఆరోపణలు పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనబడ్డట్టు ఉందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ స్కాం, బర్రెల స్కామ్, గొర్రెల స్కామ్ లు జరిగాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్కీములు తప్ప స్కీమలు లేవు అని అన్నారు.కౌశిక్ రెడ్డిని రీల్స్ స్టార్ గా పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి చేసే ఆరోపణలను చూసి ఆ పార్టీ కార్యకర్తలే నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రెండు నెలలు ప్రభుత్వ విప్ గా పని చేసి, 107 గ్రామపంచాయతీలు 60 వార్డుల్లో నిర్మాణం పూర్తయినప్పటికీ ఒక్క ఇంటిని కూడా ఇవ్వలేని కౌశిక్ రెడ్డి, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పనులు చురుకుగా సాగుతున్నాయని కమలాపూర్ మండలంలోని దేశరాజుపల్లిలో బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల అకౌంట్లో మొదటి విడతగా ₹1,00,000 జమ విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక అసత్యపు ఆరోపణలను కట్టిపెట్టి ఆధారాలతో నిరూపించాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తవుటం ఝాన్సీ రాణి, రవీందర్, గుండపు చరణ్ పటేల్, మారపల్లి మహేష్, బాలసాని రమేష్, బిక్షపతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
……………………………………….