* శ్వాస కోస ఇన్ఫెక్షన్లలో డిసెంబరు 2024 వరకు ఎక్కువ కేసులు నమోదు కాలేదు.
* తెలంగాణ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్
ఆకేరు న్యూస్, కమలాపూర్: ఇప్పటివరకు తెలంగాణలో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (హెచ్ఎంపీవీ) కేసులేవీ నమోదు కాలేదనీ, చైనా నుండి వచ్చిన హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ సంబంధించి ఆందోళన అవసరం లేదని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డా.బి.రవీందర్ నాయక్ ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ప్రబలంగా ఉన్న శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల డేటాను విశ్లేషించిన ఆరోగ్య శాఖ 2023తో పోలిస్తే 2024 డిసెంబర్లో ఇన్ఫెక్షన్ల పెరుగుదల లేదని తేల్చి చెప్పింది. ముందుజాగ్రత్త చర్యలో భాగంగా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుండి సురక్షితమైన రక్షణ చర్యలను, జాగ్రత్తలను పాటించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది.
చేయాల్సినవి :
దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు, ముక్కును రుమాలు లేదా టిష్యూ పేపర్‌తో కవర్ అయ్యేలా కప్పుకోవాలని,చేతులను తరచుగా సబ్బు , నీరు లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో కడగాలనీ, జలుబు లేదా ఫ్లూతో బాధపడుతున్న వ్యక్తుల నుండి ఒక మీటరు పొడవు కంటే ఎక్కువ దూరంలో ఉండాలని, జ్వరం, దగ్గు , తుమ్ములు ఉంటే బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉంటూ,పుష్కలంగా నీరు త్రాగాలని మరియు పౌష్టికాహారం తినాలని సూచించారు.
చేయకూడనివి :
అదేవిధంగా ఇతరులతో కరచాలనం చేయొద్దని.. ఒకసారి వాడిన టిష్యూ పేపర్, రుమాలు మళ్ళీ వాడకూడదని.. అనారోగ్య వ్యక్తులతో సన్నిహితంగా ఉండకూడదని.. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వెయ్యోద్దని సూచించారు. అలాగే వైద్యుని సంప్రదించకుండా మందులు (స్వీయ-మందులు) తీసుకోకూడదని సూచించారు.
…………………………………………..