
*అల్లారు ముద్దుగా పెంచాల్సిన చేతులు హత్య చేస్తున్నాయి
* నవమోసాలు మోసిన పిల్లలనే మట్టు పెడుతున్నారు
ఆకేరు న్యూస్ డెస్క్ : సృష్టిలో అమ్మను మించింది లేదు.. అమ్మ అనే పదంలోనే కమ్మ దనం ఉంటుంది. అమ్మ లేనిదే జీవితం లేదు.. ప్రపంచంలో అమ్మకు ఉన్న స్థానం ఎవరికీ లేదు..
శరీరానికి ఏ బాధ కలిగినా మొదటగా వచ్చేది అమ్మా ..అనే పదం.. అలాంటి అమ్మలే.. అక్కడక్కడ నరరూపరాక్షసలుగా మారుతున్నారు. కన్న పేగునే కడతేర్చుతున్నారు.వారం రోజుల కిందట మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణ పురం లో ఓ తల్లి పది నెలల కాలంలో ఇద్దరు బిడ్డలను హత్య చేసింది. ఈ ఘటన మరువకముందే తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో దారుణ ఘటన వెలుగుచూసింది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను ఓ కసాయి తల్లి ఇసుకలో పూడ్చి పెట్టింది. బిడ్డకు కష్టం రాకుండా చూసుకోవాల్సిన తల్లే ఈ ఘాతుకానికి పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. సోమవారం తెల్లవారు జాము బస్టాండ్ సమీపంలో ఉన్న ఒక దుకాణం వద్ద ఇసుకలో పూడ్చిన శిశువును పారిశుద్ధ్య కార్మికులు గుర్తించారు. స్థానికుల సహాయంతో ఆ బిడ్డను ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని యువతి ఆడ బిడ్డకు జన్మనిచ్చి పురిటి బిడ్డను ఇసుకలో పాతిపెట్టి వెళ్లిపోయినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
……………………………………..