
* ఇదే తీరు ఉంటే అసెంబ్లీలోనూ గుండు సున్నా
* మాది ప్రజా ప్రభుత్వం.. కాంగ్రెస్ పాలన
* అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అధికారం చేపట్టిన 10 నెలల్లోనే 20,617 కోట్లు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తమదని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanthreddy) తెలిపారు. రుణమాఫీ ద్వారా 25,35,000 రైతు కుటుంబాలకు రుణ విముక్తి చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వం ఎగవేసిన రైతు బంధును కూడా తమ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేసిందన్నారు. తమ విధానం – తమ ఆలోచనలు, తాము ప్రజలకు చేసిన పనులను మాత్రమే గవర్నర్ ప్రసంగంలో పొందుపరుస్తామని చెప్పారు. అవగాహన లేనివాళ్లు తాము మంత్రులుగా చేశామని చెప్పుకోవడానికి అర్హత ఉందా అని ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ ఎస్ (Brs) పాలనలో నాటి మంత్రివర్గ ఆమోదం లేకుండానే గవర్నర్ ప్రసంగం ఉందా అన్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే 2022 బడ్జెట్ సమావేశాలు ప్రారంభించారని తెలిపారు. 2023లోనూ గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని అనుకున్నారని అన్నారు. కోర్టు సూచన వల్ల గవర్నర్ ప్రసంగానికి నాడు సర్కారు అనుమతి ఇచ్చిందని గుర్గు చేశారు. వాళ్లకు గవర్నర్ వ్యవస్థపై నమ్మకం లేదని, మహిళా గవర్నర్ను అవమానించిన చరిత్ర అని తాము అలా కాదన్నారు. బలహీనవర్గాలకు చెందిన మహిళా గవర్నర్ ను గత ప్రభుత్వం అవహేళన చేసిందన్నారు. లోక్ సభ (Loksabha) ఎన్నికల్లో గుండు సున్నా వస్తుందని చెప్పాను, బీఆర్ ఎస్ సభ్యులు ఇలానే ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గుండు సున్నానే వస్తుందన్నారు. అబద్దాల ప్రాతిపదికన ప్రతిపక్షాల గొంతు నొక్కాలని తాము అనుకోవడం లేదన్నారు. ప్రజల శ్రేయస్సు, వాళ్లకు మేలు చేయాలనే తాము ఆలోచిస్తున్నామన్నారు. మాది ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ పాలన అన్నారు. సాయుధ రైతాంగ పోరాటం జరిగిందే భూమి కోసమన్నారు. రైతు ఆత్మహత్యలకు కారణం అప్పులేనన్నారు.
……………………………….