* డా.కె.వి రమణాచారి
* సాహితీ భిక్ష పెట్టిన గురువు రంగాచార్య : కసిరెడ్డి వెంకటరెడ్డి
* బోధన, పరిశోధన, పరివ్యాప్తికి నిరంతరం కృషి : ఆచార్య కోట్ల హనుమంతరావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అధ్యయనం.. అభ్యాసనంలో విశేష అనుభవశాలి ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ రంగాచార్య అని ప్రభుత్వ పూర్వ సలహాదారు డా.కె.వి రమణాచారి తెలిపారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శ్రీరంగాచార్యకు విశిష్ట పురస్కారం-2024 ప్రదానం చేశారు. పురస్కారం కింద రూ.1 లక్ష నగదు, ప్రశంసా పత్రం అందజేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళామందిర్ లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో రమణాచారి మాట్లాడుతూ పుస్తకం చూడకుండా పాఠ్యం చెప్పగల వ్యక్తి రంగాచార్య అన్నారు. ఆనాడు విద్యార్థి సంఘంలో చురుకైన పాత్ర పోషించిన ఆచార్య వెలుదండ నిత్యానందరావు విద్యార్థిగా పెరిగి పెద్దయ్యాక, ఉన్నత స్థానానికి చేరాక గురువులను గుర్తుపెట్టుకుని సత్కరించడం సంతోషదగ్గ విషయమన్నారు. గురుశిష్యుల బంధానికి నిదర్శనం ఈ సత్కారం అన్నారు. గురువుకు పురస్కారం స్ఫూర్తివంతమైన కార్యక్రమం అని తెలిపారు. సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్న మహానుభావులకు ఏటా తెలుగు వర్సిటీ అందించే విశిష్ట పురస్కారం ఈ ఏడాది రంగాచార్యకు అందివ్వడం సంతోషకరమన్నారు.
సాహితీ భిక్ష పెట్టిన గురువు
గౌరవ అతిథి ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, భిక్ష పెట్టిన గురువు రంగాచార్య అని వెల్లడించారు. పాలెం విద్యాసంస్థలో 1966-67 సంవత్సరంలో తాను ఆయన దగ్గర చదువుకునే ఈ స్థాయికి చేరుకున్నానని నాటి రోజులను గుర్తు చేశారు. హాస్టల్లోని విద్యార్థులు చదువుతున్నారా-లేరా అని మధ్యరాత్రిలో కూడా వచ్చి తలుపుతట్టి పరిశీలించేవారని తెలిపారు. పితృ, మాతృ, గురు వాత్సల్యం చూపించిన వ్యక్తి రంగాచార్య అన్నారు. ఆరోజుల్లోనే సురవరం ప్రతాపరెడ్డి వంటి ప్రముఖుల గురించి తమకు తెలిపేవారన్నారు. వర్ధమానపురం తీసుకెళ్లి శాసనాలు ఎలా ఉంటాయో, ప్రత్యక్షంగా చూపించారని వెల్లడించారు. శాసనాల గొప్పతనాన్ని వివరించేవారన్నారు. విద్యార్థిగా ఉన్నతస్థాయికి ఎదగడానికి, విజ్ఞానం పొందడానికి కారకులు ఆయనే అన్నారు. తాను ఉస్మానియా వర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ సాధించడానికి ఆయన దగ్గర నేర్చుకున్న విద్యే మూలకారణమన్నారు. పద్యాలు-కవితలు వివరించి భాష-సాహిత్యం గొప్పతనాన్ని చాటారు.
పాలెం నీళ్లలోనే ఆ గొప్పతనం
పురస్కార గ్రహీత రంగాచార్య మాట్లాడుతూ తొలుగు తెలుగు వర్సిటీకి కృతజ్ఞతలు తెలిపారు. మహామహుల సమక్షంలో పురస్కారం అందుకునే అవకాశం రాకపోయినా, రమణచారి సమక్షంలో ఈ పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. పాలెం కళాశాలలోనే తన మొదటి ఉద్యోగమని అక్కడే రిటైర్ట్ అయ్యాయని తెలిపారు. పాలెం గొప్పతనాన్ని చాటారు. పాలెంలో చదువుకున్న వాళ్లందరూ వివిధ రంగాల్లో నిష్ణాతులయ్యారని తెలిపారు. విశ్వజనకీర్తియుడినై ఉన్నానంటే పాలెం జిల్లా నీళ్ల గొప్పతనం అన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ వశమైన ఓరియంటల్ కళాశాల పాలెం ఓరియంటల్ అని తెలిపారు. అప్పటి నుంచి జీతాలు సకాలంలో వచ్చేవన్నారు. తనను సత్కరించడం ద్వారా మన విశ్వ విద్యాలయం మహబూబ్నగర్ జిల్లాపైన ప్రేమ కురిపించినట్లుగా భావిస్తానన్నారు. సాహిత్య కృషి కొనసాగిస్తూనే ఉంటానని వెల్లడించారు.
1800 మంది కళాకారులకు సత్కారం
కార్యక్రమం ప్రారంభానికి ముందు రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు మాట్లాడుతూ నందమూరి తారకరామారావు మానస పుత్రిక గా 1985 డిసెంబర్ 2న స్థాపించిన తెలుగు విశ్వ విద్యాలయం బోధన, పరిశోధన, పరివ్యాప్తి కోసం నిరంతరం పాటుపడుతోందని తెలిపారు. స్థాపించిన కొన్ని సంవత్సరాల్లోనే విశ్వ వ్యాప్తమైందని అన్నారు. 40 ఏళ్లలో 1800 మంది కళాకారులను, సాహితీవేత్తలను సన్మానించినట్లు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో 2023లో బాచుపల్లి క్యాంపస్లో అత్యాధునిక భవనాలు, సౌకర్యాలతో రూపుదిద్దుకున్నట్లు వెల్లడించారు. త్వరలో అత్యాధునిక ఆడిటోరియం నిర్మించబోతున్నట్లు హనుమంతరావు వెల్లడించారు. ఆపార్ ఐడీ రిజిస్ట్రేషన్లలో ముందు వరుసలో తెలుగు వర్సిటీ ఉందన్నారు. సాహితీవేత్తగా ఆచార్య రంగాచార్య ఎనలేని గుర్తింపు, విశిష్ట వ్యక్తిత్వం గలవారన్నారు.
…………………………………………………
