
* కాంగ్రెస్ సర్కారు హయాంలో కీలక పథకాలు అమలు చేస్తున్నా..
* సంక్షేమంలో విభిన్న పంథా ఉన్నా..
* ఆర్థిక ఇబ్బందుల్లోనూ హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నా..
* ఆశించిన మైలేజీ కరువు
* ఆలస్యం, అమల్లో తప్పటడుగులు కారణాలు
* విపక్షాల వ్యతిరేక ప్రచారాన్ని ఐక్యంగా తిప్పికొట్టలేకపోవడం కూడా..
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
“16 నెలలైనా బ్రాండ్ ఎందుకు సృష్టించుకోలేదని కొందరు నన్ను అడుగున్నారు. యంగ్ ఇండియాలో చదువు, యువతకు ఉపాధే నా బ్రాండ్ “
– తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇవి.
రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటి వరకు సరైన గుర్తింపు అనేది లేదని స్వయంగా సీఎం చెప్పకనే చెప్పారు. వాస్తవానికి రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కీలక సంస్కరణలు చేపట్టినప్పటికీ సరైన ఖ్యాతి రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. చేసిన పనులను చెప్పుకోలేకపోవడం, చేయాల్సిన సమయంలో చేయలేకపోవడం అందులో ప్రధానమైనవి.
సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయడం అనేది ఆషామాషీ కాదు.. చరిత్రలో ఎవరు అధికారంలోకి వచ్చినా, వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా రద్దు చేసే సాహసం చేయలేరు. పేదలకు జీవితకాలం సన్నం బియ్యం ఇవ్వాల్సిందే అన్నారు. నాడు సీఎం చెప్పిన మాటలు అక్షర సత్యం. అది ఆషామాషీ పథకం కాదు. ఇప్పటి వరకు కేజీ బియ్యం రూ.50 పెట్టి కొనే స్థోమత ఉన్నోడే సన్నబియ్యం వండుకు తినేవారు. ఇప్పుడు పేదోడి ఇంట కూడా సన్నబియ్యం వంట మొదలైంది.
అయినా పాజిటివ్ టాక్ ఉందా?
చారిత్రక పథకాన్ని ప్రారంభించినప్పటికీ హెచ్సీయూ భూముల అంశం ప్రభుత్వాన్ని కుదిపేసింది. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు మల్లగుల్లాలు పడాల్సి వస్తోంది. వాస్తవానికి ఒక మంచి కార్యక్రమం రాష్ట్రంలో జరిగినప్పుడు మొత్తం అంతా దాని గురించే మాట్లాడుకునేలా సర్కారు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఆ స్థాయిలో కేడర్ ను ఉత్సాహపరిచి ఆ పథకాన్ని ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్లేలా దిశా నిర్దేశం చేయాలి. అలాంటి విషయాల్లో రేవంత్ అండ్ టీం ఫెయిల్ అయిందనే వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సన్నబియ్యమే కాదు, వాస్తవానికి మంచి కార్యక్రమాలు చాలానే చేపట్టింది. వాటిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహ లక్ష్మి ద్వారా 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ, రైతు రుణమాఫీ వంటి కీలక కీలకమైనవి ఎన్నో ఉన్నాయి. అలాగే దాదాపు పదేళ్లుగా గత ప్రభుత్వం ఇవ్వని రేషన్ కార్డుల పంపిణీకి కూడా శ్రీకారం చుట్టింది. అయినప్పటికీ కాంగ్రెస్ సర్కారుపై ఆశించి స్థాయిలో పాజిటివ్ టాక్ ఉండడం లేదు. అందుకు ఆయా పథకాల్లోని లోటుపాట్లపై విపక్షాల బలమైన ప్రచారం ఒకటైతే, చేసిన పనులను ఐక్యంగా చాటి చెప్పడంలో రేవంత్ రెడ్డి టీం విఫలం కావడం మరో కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒక్క పథకానికే రూ.20 వేల కోట్లకుపైగా కేటాయించినా..
చెప్పిన స్థాయిలో కాకపోయినా, తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు సంక్షేమంలో విభిన్న పంథాను కొనసాగిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల్లోనూ హామీలు అమలు దిశగా అడుగులు వేస్తోంది. విపక్షాల ప్రచారాన్ని ఐక్యంగా తిప్పికొట్టలేకపోవడంతో ప్రభుత్వం చేస్తున్న పనులపై అంతగా చర్చ జరగడం లేదు. లోటుపాట్లే ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి. దాదాపు 20 వేల కోట్లకు పైగా రైతురుణాలను మాఫీ చేసి, 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు రుణ విముక్తి కల్పించినప్పటికీ, కొందరు విషయంలో జరిగిన అన్యాయంపై విపక్షాలు చేస్తున్న ప్రచారమే బాగా జరుగుతోంది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లోనూ కేవలం ఒక్క పథకం కోసం 20 వేల కోట్లు కేటాయించినప్పటికీ కాంగ్రెస్ సర్కారుకు అంతగా ఒరిగేందేమీ లేదనే చెప్పొచ్చు. రుణమాఫీ అనవసరంగా నెత్తిన వేసుకున్నామని, పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదనేదే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లిందని స్వయంగా ఓ కీలక మంత్రే తన అంతరంగికులతో వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుంటే.., కీలక పథకాలను అమలు చేస్తున్నా కాంగ్రెస్ సర్కారుకు ఆ స్థాయిలో మైలేజీ రాలేదనే చెప్పాలి.
ఆలస్యం.. అమృతం.. విషం
పదేళ్ల బీఆర్ ఎస్ పాలనకు చరమగీతం పాడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆలస్యం.. అమృతం.. విషం అనే సామెత కరెక్టుగా సరిపోతుంది. ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలను ప్రకటించి ప్రజలను ఆకట్టుకుంది. అధికారంలోకి వచ్చిన రెండో రోజే అందులో ఒకటైన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమల్లోకి తెచ్చి పాలనపై ఆసక్తిని రేకెత్తించింది. మిగతా హామీల అమలులోనూ ఇదే దూకుడు ప్రదర్శిస్తుందని అందరూ భావించారు. ఆ తర్వాత మిగతా పథకాల అమలుకు దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రజాపాలన పేరుతో కార్యక్రమం ప్రారంభించింది. అదే సందర్భంలో అందులో రేషన్ కార్డులకు సంబంధించిన కాలమ్ లేకపోవడం, అన్ని పథకాలకూ ఆ కార్డు ప్రామాణికం కావడం గందరగోళానికి దారి తీసింది. మిగతా పథకాలకు దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ప్రారంభానికి ఆలస్యమైంది. ఆ తర్వాత కొన్ని అద్భుత పథకాలను అమలు చేసినప్పటికీ.. ఆలస్యాన్ని విపక్షాలు విస్తృతంగా ప్రచారం చేశాయి. అది ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఆర్థిక లోటుగా పూడ్చుకుంటూ ఒక్కొక్కటిగా కీలక పథకాలను అమలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో సర్కారు పేరు తెచ్చుకోలేకపోయినట్లు స్పష్టం అవుతోంది. ఇప్పటి కయినా మిగిలిన పథకాల అమలుకు టైం బాండ్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. వాయిదాలు పడకుండా పక్కాగా అమలు చేయాలి. ప్రధానంగా కేబినెట్ టీం అంతా ఒకే మాటపై ఉండాలి. విపక్షాల వ్యతిరేక ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పి కొట్టగలగాలి. చేసిన పనులపై ప్రజల్లో చర్చ జరిగేలా విస్త్రత ప్రచారం చేయగలగాలి. అప్పుడే బ్రాండ్ క్రియేషన్ సాధ్యం అవుతుంది.
……………………………………………….