
* హైదరాబాద్ సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్
*ప్రపంచ ఆత్మహత్యల నివారణ వారోత్సవాలు
*హెల్ప్ లైన్ లోగో ను ఆవిష్కరించిన డీసీపీ
ఆకేరున్యూస్, హైదరాబాద్ : జీవించడానికే ఈ జీవితం ఉందని బలవంతంగా జీవితానికి ముగింపు పలకవద్దని హైదరాబాద్ సౌత్ వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి.చంద్రమోహన్ అన్నారు.”జీవితం జీవించడానికే…చావడానికి కాదు” అనే నినాదంతో తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల నాల్గవ తేదీ నుండి పదవ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ప్రపంచ ఆత్మహత్యల నివారణ వారోత్సవాలకు సంబంధించిన సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్ లైన్ లోగోను డీసీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలతో ఆత్మహత్యలకు పాల్పడవద్దని యువతీ యువకుల నుద్దేశించి అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎం.ఏ.కరీం మాట్లాడుతూ విద్యార్థులు మానసిక నిర్బంధానికి గురి కావద్దని, తమ ఆలోచనలను, మానసిక ఉద్వేగాలను నియంత్రించుకోవాలని అన్నారు. ఎట్టి పరిస్థితులలోను నిరాశ-నిస్పృహలకు గురికావద్దని తెలిపారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసంతోపాటు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఆత్మహత్యల నివారణపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగాపాల్గొన్న తెలంగాణ మ్యాజిక్ అకాడమీ రాష్ట్ర అధ్యక్షుడు మర్రిరమేష్ మాట్లాడుతూ ఆత్మహత్యల నివారణ సామాజిక బాధ్యతగా అందరు స్వీకరించాలని అన్నారు. మరో అతిథి అంజనామూర్తి మాట్లాడుతూ మానసిక రుగ్మతలకు గురైన వారికి తగు సలహాలు సూచనల అందించుటకు మానసిక నిపుణులు అందుబాటులో ఉండడం అభినందనీయమని అభిప్రాయపడ్డారు. మానసిక రుగ్మతలకులోనై వారు ఆత్మహత్య తలంపులు ఉన్నపుడు ఆన్ లైన్ లో లేదా ఫోన్ ద్వారా సంప్రదించి మానసిక నిపుణుల సేవలను ఉచితంగా పొందాలని సూచించారు. ఈ సదవకాశం తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా అందుబాటులో ఉంది. సూసైడ్ ప్రివెన్షన్ రాష్ట్ర హెల్ప్ లైన్ నెంబర్ 040-35717915 లేదా 9440488571 నెంబర్లు ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అందుబాటులో ఉంటాయని సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎం.ఏ.కరీం తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, మానసిక నిపుణులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………….