* తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ కు ఊరట
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఫార్ములా ఈ – కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ కేసు(ACB CASE)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. కేటీఆర్ తరఫు న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేటీఆర్‌పై పలు సెక్షన్లు నమోదు చేశారని, ఈ సెక్షన్లు ఈ కేసు కింద వర్తించవని అన్నారు. గత ఏడాది సీజన్ 9 కార్ రేసింగ్ నిర్వహించారని తెలిపారు. ఈ కార్ రేసింగ్ నిర్వహించడానికి 2022 అక్టోబర్ 25నే ఒప్పందం జరిగిందన్నారు. సీజన్ 9 సమయంలోనే అగ్రిమెంట్ జరిగిందని, సీజన్ 10కి అగ్రిమెంట్ అవసరం లేదని తెలిపారు. అగ్రిమెంట్ జరిగిన 14 నెలలకు కేసు పెట్టారని, రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని సుందరం వాదనలు వినిపించారు. కేటీఆర్ లబ్ది పొందినట్లు ఎఫ్ ఐఆర్‌లో ఎక్కడా లేదని తెలిపారు. హైదరాబాద్(HYDERABAD)కు మంచి పేరు తేవాలనే ఈ రేస్ నిర్వహించినట్లు కోర్టుకు విన్నవించారు.
ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి(AG SUDARSHANREDDY) కోర్టులో వాదనలు వినిపించారు. కేటీఆర్ పై కేసును రాజకీయ కక్ష అనడానికి చాన్స్ లేదన్నారు. డబ్బు పంపే సమయానికి అగ్రిమెంట్ లేదన్నారు. ప్రాథమిక దర్యాప్తు తర్వాతే కేసు నమోదుకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు వివరించారు. ఎఫ్ ఐఆర్ లో అన్ని విషయాలూ ఉండవన్నారు. దర్యాప్తులో చాలా మంది నిందితులు యాడ్ అవుతారని వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు పది రోజుల వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని ఏసీబీని ఆదేశించింది. 30 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశాలు ఇచ్చింది. ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని పేర్కొంది. తదుపరి విచారణను హైకోర్టు (HIGH COURT)27కు వాయిదా వేసింది.
………………………………………………….