* బస్సుపై కంకర మీద పడడంతో కూరుకుపోయిన ప్రయాణికులు
* ప్రమాదంలో మొత్తం 24 మంది మృతి
* మృతుల్లో పది నెలల చిన్నారితో పాటు 10 మంది మహిళలు
* సహాయక చర్యల కోసం వెళ్లిన చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ కాళ్ల పైకి ఎక్కిన జేసీబీ
*హుటాహుటిన సీఐని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలింపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
సోమవారం ఉదయం తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ డీకొట్టింది. టిప్పర్ లో ఉన్న కంకర బస్ మీద పడడంతో బస్ లోని ప్రయాణికులు ఊపిరాడక మృతి చెందారు. ప్రమాదంలో మొత్తం 24 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో పది నెలల చిన్నారితో పాటు పది మంది మహిళలు ఉన్నారు, గాయ పడ్డ వారిని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరు డ్రైవర్లతో సహా మొత్తం 24 మంది ప్రయాణికులు చనిపోయారు.బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మూడు జేసీబీల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. ఇప్పటివరకు 15 మందిని బస్సులోనుంచి బయటకు తీశారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తున్నది. విద్యార్థులు హైదరాబాద్‌లోని పలు కాలేజీల్లో చదువుతున్నట్లు సమాచారం. బస్సుపై టిప్పర్ పడిపోవడంతో డ్రైవర్ వైపు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రయాణికుల ఆర్తనాలతో ప్రమాద స్థలం హృదయవిదారకంగా మారింది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఘటనా స్థలానికి అంబులెన్స్‌కు కూడా చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది.
సీఐ కాళ్ల పైకి జేసీబి
ప్రమాద సమాచారం అందిన వెంటనే సహాయక చర్యల కోసం వెళ్లిన చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్
ప్రయాణికులను బయటకు తీసే ప్రయత్నం చేస్తుండగా ఆయన కాళ్లపై నుంచి జేసీబీ వెళ్లడంతో సీఐ తీవ్రంగా గాయపడ్డారు. గాయ పడ్డ సీఐని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బస్సు ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 20 మంది దుర్మరణం పాలైన ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
…………………………………………………………..
