
– ఆపరేషన్ సింధూర్ తో దేశ శక్తిని చాటిచెప్పిన త్రివిధ దళాలకు సెల్యూట్…
– కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
ఆకేరు న్యూస్, హుజూరాబాద్: పహల్గం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా హుజురాబాద్ లో మంగళవారం సాయంత్రం తీరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హాజరై మాట్లాడుతూ… 26 నిమిషాల్లో పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన ఘనత భారత సైన్యానికి దక్కుతుందన్నారు. రానున్న కాలంలో పాకిస్థాన్ ఎటువంటి కవ్వింపు చర్యలకు, దురాగతాలకు పాల్పడినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, భారత ప్రధాని ధీటుగా బదులిచ్చారన్నారు.ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పోరాడి అమరులైన వీర జవాన్లకు, వీరోచిత పోరాటం చేస్తున్న భారత సైనికులకు వందనాలు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో భాగంగా వందేమాతర గీతాన్ని ఆలపించారు. పహల్గం ఉగ్ర దాడిలో చనిపోయిన వారి ఆత్మశాంతికై వారి కుటుంబాలకు బాసటగా నిలవాలని, జాతీయ సమైక్యత పట్ల నినాదాలు చేశారు.ఈ సందర్భంగా భారత్ మాతాకీ జై ,జై జవాన్ నినాదాలు హోరెత్తాయి. భారత సైనికులకు సంఘీభావంగా ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ కూడలి నుంచి సూపర్ బజార్ గుండా సైదాపూర్ రోడ్డు వరకు అక్కడి నుంచి గవర్నమెంట్ ఆసుపత్రి వరకు కొనసాగింది. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి గుర్రం నిర్మలారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, మండల అధ్యక్షులు రాజు, ర్యాకం శ్రీనివాస్, కొండల్ రెడ్డి రాష్ట్ర, జిల్లా పదాధికారులు, మాజీ మండల అధ్యక్షులు, వివిధ మోర్చా నాయకులు, సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు, మహిళలు వివిధ సంఘాల నాయకులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
……………………………………..