దాతల దంపతులు శ్రీ వర్ధమాన్ జైన్, శ్రీమతి రాధికా జైన్ స్వామివారికి 121 కిలోల 24 క్యారెట్ల బంగారు ఆభరణాలను కానుకలను సీఎం చంద్రబాబు సమక్షంలో సమర్పించారు
* 121 కిలోల ఆభరణాల సమర్పణ..!
* చెన్నైకి చెందిన జైన్ దంపతుల భారీ విరాళం
* 24 క్యారెట్ల బంగారంతో 46 ప్రత్యేక ఆభరణాలు
ఆకేరు న్యూస్, తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి భారీ బంగారు కానుక సమర్పించారు. చెన్నైకి చెందిన దాతల దంపతులు శ్రీ వర్ధమాన్ జైన్, శ్రీమతి రాధికా జైన్ గురువారం స్వామివారికి 121 కిలోల 24 క్యారెట్ల బంగారు ఆభరణాలను (Tirumala Gold Donation) అందజేశారు. వీటి విలువ మేకింగ్ ఛార్జీలతో కలిపి రూ.207.6 కోట్లుగా నిర్ధారించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఆభరణాలకు సంబంధించిన ఫొటోలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేసింది. 
* 46 ఆభరణాలు.. 33 రకాలు
మొత్తం 121 కిలోల 24 క్యారెట్ల బంగారంతో 33 రకాలకు చెందిన 46 ఆభరణాలను ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో తిరుమల శ్రీవారి ఆలయ ఆభరణాల కోసం 106 కిలోల బంగారాన్ని వినియోగించారు. మిగిలిన 15 కిలోల బంగారంతో తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి వస్త్రాన్ని తయారు చేయనున్నారు.

ఈ కానుకలో (TTD Gold Donation) బంగారంతో పాటు వజ్రాలు, విలువైన రత్నాలు, సాలిగ్రామ రాళ్లు కూడా ఉన్నాయి. మొత్తం వజ్రాల బరువు 238.2 క్యారెట్లు కాగా, ఇతర విలువైన రత్నాల వివరాలను కూడా టీటీడీ వెల్లడించింది. నీలమణులు 91.6 క్యారెట్లు, పసుపు నీలమణులు 84.2 క్యారెట్లు ఉన్నాయి. కెంపులు, పచ్చలు కలిపి 2,916.5 గ్రాముల బరువున్నాయి. వీటితో పాటు సాలిగ్రామ రాళ్లను కూడా సమర్పించారు.

* ప్రత్యేక ఆభరణాలు ఇవే..
శ్రీవారికి సమర్పించిన ఆభరణాల్లో పాద కవచాలు, అందెలు, పొగడ, తులసీ పత్ర పుష్పం, అష్టోత్తర శతనామ కాసుల హారం, చతుర్భుజ లక్ష్మీ హారం, పులిగోరు, అష్టోత్తర పత్ర హారం, నరహారాలు, గంటల మొలతాడు, సువర్ణ కంఠి, కనక పుష్పం వంటి ఆభరణాలు ఉన్నాయి.
అలాగే అభయహస్తాల కంకణాలు, చందనవంక కంఠి, వైకుంఠ హస్తం, కత్తి హస్తం, నాగాభరణ కడియాలు, నాగాభరణాలు, బాహువులు, సాలిగ్రామ హారాలు, కమలాల త్రిభుజ సాలిగ్రామ హారాలు, శంఖ కవచం, చక్ర కవచం, ముత్యాల పూస, కిరీటం వంటి ప్రత్యేక ఆభరణాలను కూడా సమర్పించారు.

* చంద్రబాబు సమక్షంలో సమర్పణ..
శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఉంచిన 46 ఆభరణాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, దాతల దంపతులు, వారి కుటుంబ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా దాతల ఉదారతను చంద్రబాబు ప్రశంసించారు. అనంతరం దాతల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు పళ్లెంలో ఆభరణాలను తలపై పెట్టుకుని ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేశారు.

అనంతరం గర్భగుడిలో స్వామివారి సన్నిధిలో ఆభరణాలను ఉంచి పూజలు నిర్వహించారు. శ్రీవారిపై భక్తితో సమర్పించిన ఈ భారీ బంగారు కానుక తిరుమల ఆలయ ఆభరణాల సంపదలో మరో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. టీటీడీ విడుదల చేసిన ఆభరణాల ఫొటోలు భక్తుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Also Read : రాజ్యాంగ పరిరక్షణే అంబేద్కర్‌కు నిజమైన నివాళి!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

