
* రాజ్యాంగంపై ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేదు
* మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ఆకేరున్యూస్, భూపాలపల్లి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రజలకు తెలిస్తేనే ప్రశ్నించే తత్వం వస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బహుజన సేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రాజ్యాంగ స్తూపాన్ని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం, హక్కుల గురించి అవగాహణ లేకుంటే ధైర్యం ఉండదన్నారు. ఈ క్రమంలోనే రాజ్యాంగంలోని విషయాలు ప్రజలకు తెలిస్తే మనల్ని ప్రశ్నిస్తారనే కుట్రలు దాగి ఉన్నాయన్నారు. రాజ్యాంగ నిర్మాణం జరిగి 75ఏండ్లు గడుస్తున్న రాజ్యాంగం కోసం ప్రజల్లోకి తీసుకెళ్లే పరిస్థితులు రావడం బాధాకరమన్నారు. అయితే ఇన్నేండ్లుగా పరిపాలన చేస్తున్న ప్రభుత్వాలకు రాజ్యాంగంపై చిత్తశుద్ది లేదని, అసెంబ్లీ, పార్లమెంట్లో రాజ్యాంగం గురించి మాట్లాడటం, అవసరమైతే అర్టికల్ గురించి చెప్పడం తప్ప ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన చేయలేదన్నారు. ప్రజలకు రాజ్యాంగం గురించి తెలియజేయాలనే తపనతోనే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. అయితే విద్యార్ధి దశలోనే రాజ్యాంగంపై అవగాహణ కల్పించాలనే ఆలోచన ప్రభుత్వాలు ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలో పాఠ్యాంశాల్లో రాజ్యాంగాన్ని చేర్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవైపు పాలకులు రాజ్యాంగం పరిరక్షించాలని మాట్లాడుతూనే మరోవైపు రాజ్యాంగంపై ప్రమాణాలు చేసి అసెంబ్లీ, పార్లమెంట్, లోక్‌సభల్లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిరసనలు చేయడం మాట్లడటం జరుగుతుందన్నారు. బీజేపీ నేత అమిత్‌షా పార్లమెంట్లో అంబేద్కర్ గురించి అవమానకరంగా మాట్లాడారని, ఇంతకంటే దురదృష?కరం ఏముంటుందన్నారు. దేశంలోని ప్రజలకు సమాన హక్కులు కల్పించాలని, సమానంగా జీవించాలని రాజ్యాంగంలో పొందుపర్చి ఉందన్నారు.అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అగ్రవర్ణాలకు మనువాద సిద్దంతాలను నూటికి నూరు శాతం అమలు చేస్తూ ఒక్క మతం కోసమే పని చేస్తుందన్నారు. కేవలం హిందుత్వాని ఎలా పెంచాలనే ఆలోచన తప్ప విద్యావకాశాలు, వ్యవసాయ రంగాలను ఎలా కాపాడాలనే ఆలోచన చేస్తలేదని ఆయన విమర్శించారు. ఆర్థికంగా విద్యాపరంగా పేదరికరంగాల్లో 50అంశాల్లో మనం వెనుకబడిపోయామని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. అనేక ఏండ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అనేక అబద్దాలు ఆడుతుందన్నారు. ఆనాడు గరీబ్ హాటావ్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ పాలనలో పేదరికం పోయిందా అని ఆయన ప్రశ్నించారు. ఈనాడు రాష్ట్రంలో సైతం అనేక అబద్దాలు, మాయమాటలతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలను నట్టేల ముంచిందన్నారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా పూర్తిగా అమలు చేయలేదని, ఈ ప్రభుత్వం మూలంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని ఆయన అన్నారు. అంబేద్కర్ వారసులు రాజ్యాంగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
……………………………………..