
ఆకేరు న్యూస్ డెస్క్ : వరలక్ష్మి వ్రతాన్ని వివాహిత స్త్రీలు ఆచరిస్తారు. లక్ష్మీదేవిని వరలక్ష్మీగా పూజిస్తారు. లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు , శ్రేయస్సు, ఆనందం లభిస్తాయని ఆనవాయితీగా వస్తోంది. ఈ వరలక్ష్మీ వ్రతం ఎలా వచ్చిందనే విషయాలను పరిశీలిద్దాం.
పురాణాల ప్రకారం
చారుమతి అనే స్త్రీ తన భర్త, కుటుంబంతో మగధ దేశంలోని భద్రశ్రీ నగరంలో నివసించేది. చాలా భక్తిపరురాలు. భర్త పట్ల ఎంతో అంకితభావం, సేవా దృక్పథం కలిగి ఉండేది. క్రమం తప్పకుండా లక్ష్మీ దేవిని భక్తితో పూజించేది. ఆమె భక్తి, విశ్వాసంతో మెచ్చిన తల్లి లక్ష్మీదేవి ఆమె కలలో కనిపించి, శ్రావణ శుక్ల పక్ష శుక్రవారం ఉపవాసం ఉండి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే.. అదృష్టం, సంపద, శ్రేయస్సు లభిస్తాయని చెబుతుంది. మేల్కొన్న తర్వాత, చారుమతి తన స్నేహితులకు, నగరంలోని ఇతర మహిళలకు చెప్పింది. అందరూ కలిసి ఆచారాల ప్రకారం ఉపవాసం పాటించారు. ఫలితంగా, అందరి ఇళ్లలో సంపద, ఆనందం, శ్రేయస్సు, అదృష్టం కలుగుతాయి. అప్పటి నుంచి ఈ వ్రతం వరలక్ష్మీ వ్రతంగా ప్రాచుర్యం పొందింది. ఈ ఉపవాసం పాటిస్తే అష్టలక్ష్మీ అనగా సంపద, శ్రేయస్సు, శక్తి, భూమి, జ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. ఈ వ్రతాన్ని వివాహితలు భర్త అదృష్టం, దీర్ఘాయువు కోసం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకుంటారు. లక్ష్మీ ఫోటోను పూజించినా, అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.
సులభమైన పూజించే పద్ధతి
* ఇంట్లో లక్ష్మీ దేవి పూజకు వెండి లేదా రాగితో చేసిన కలశం కొనాలి. ఆ కలశానికి పసుపు, కుంకుమ పూయాలి.
* కలశంను బియ్యంతో నింపాలి. బియ్యం శ్రేయస్సుకు చిహ్నం.
* ఐదు మామిడి ఆకులను తీసుకుని కలశం పైభాగంలో ఉంచాలి
* కలశంపైన కొబ్బరికాయ ఉంచి పసుపు, కుంకుమ రాయాలి
* లక్ష్మీ దేవతని పూలతో, దేవత కూర్చునే చెక్క కుర్చీ చుట్టూ పూల అలంకరణలు చేయాలి
* అనంతరం కలశం దగ్గర దీపం వెలిగించి, అమ్మవారికి పండ్లు, పువ్వులు, స్వీట్లు సమర్పించి భక్తితో అమ్మవారిని పూజించాలి.
* పులిహోర, గారెలు, బూరెలు, పరమాన్నం, వడపప్పు, పానకం, శనగలు, చలిమిడి వంటి సంప్రదాయ ప్రసాదాలు పెట్టాలి.
ఈ తప్పులు చేయవద్దు
* విరిగిన విగ్రహాలను పూజా స్థలంలో లేదా ఆలయంలో ఉంచకూడదు.
* లక్ష్మిదేవిని ఇనుప కుర్చీపై కూర్చోబెట్టకూడదు.
* ప్లాస్టిక్ పూలు, పండ్లను ఉపయోగించవద్దు.
* పూజ సమయంలో మీ మనస్సును చెడు ఆలోచనలకు దూరంగా ఉంచండి.
* అప్పుగా తీసుకున్న డబ్బు లేదా నగలు ఉపయోగించవద్దు.
* తుప్పు పట్టిన నగలను ఎప్పుడూ ఉపయోగించవద్దు.
* నైవేద్యానికి ఉపయోగించే పదార్థాలు, నైవేద్యం పెట్టే పాత్రలు శుభ్రంగా ఉండాలి.
* నైవేద్యంలో ఇతర పదార్థాలు కలపకూడదు.
………………………………….