* పండుగ పూట ఠారెత్తిస్తున్న ధరలు
ఆకేరు న్యూస్ డెస్క్ : కూరగాయల ధరలు ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రూ.400 పెడితే కానీ ఓ చిన్న కుటుంబానికి వారానికి సరిపడా కూరగాయలు రావడం గగనంగా మారింది. దసరా పండుగ వేళ ఈ ధరాఘాతంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఇప్పటికే వంట నూనెలకు తోడు కూరగాయల రేట్లు ఆకాశాన్ని తాకడంతో సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే వంటనూనె ధరలు 20 నుంచి 30 రూపాయలకు పెరిగాయి. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటా ధరలు ఠారెత్తిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు 30 నుంచి 40 రూపాయలు పలికిన టమాటా, ప్రస్తుతం హోల్‌సేల్ వ్యాపారులు కూడా కిలో టమాటా 80 రూపాయలకు విక్రయిస్తుంటే, రిటైల్ వ్యాపారులు 100 రూపాయలకు విక్రయిస్తున్నారు. రూ.70కు పైగా ఉల్లి రేటు పలుకుతోంది. నాసిరకమైతే 50 నుంచి 60 ఉంది. అయితే డిమాండ్‌కు సరిపడా దిగుబడులు లేకపోవడం వల్లే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల వచ్చిన వరదలు కూడా టమాటా కొరతకు కారణం అయ్యాయని పేర్కొంటున్నారు.
………………………..