
* ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని వెల్లడి
ఆకేరు న్యూస్, డెస్క్ : యుద్ధం వద్దు.. శాంతి ముద్దు అని కోరుకునే వారికి శుభవార్త. కొద్ది రోజులుగా భారత్-పాక్ మధ్య సరిహద్దుల్లో జరుగుతున్న కాల్పుల హోరు ఇక తగ్గనుంది. అగ్రరాజ్యం అధినేత ట్రంప్ ఈమేరకు కీలక ప్రకటన చేశారు. తక్షణ కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా మధ్యవర్తిత్వంతో రాత్రంతా చర్చలు జరిగాయని ఎక్స్ లో వెల్లడించారు. భారత్, పాక్ వెంటనే కాల్పులు ఆపేందుకు అంగీకరించినట్లు ప్రకటించారు. రెండు దేశాలు శాంతికి ముందడుగు వేశాయని అభినందించారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు ఇరు దేశాలూ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయా సైన్యాలకు కీలక ఆదేశాలు అందినట్లు సమాచారం.
కాల్పులు విరమించాం : విక్రమ్ మిస్రీ
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా ఈమేరకు ఓ ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలిపారు. “పాకిస్తాన్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) ఈ మధ్యాహ్నం 3:35 గంటలకు భారత DGMO కి ఫోన్ చేశారు. భారత ప్రామాణిక సమయం ప్రకారం 17..00 గంటల నుండి భూమిపై, గాలిలో, సముద్రంలో అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయాలని వారి మధ్య ఒప్పందం కుదిరింది. డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మే 12న 12:00 గంటలకు మళ్ళీ మాట్లాడుకుంటారు.” అని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
అవును అంగీకరించాము : పాక్ ప్రకటన
భారత్ – పాకిస్థాన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు పాక్ విదేశాంగ మంత్రి ఇషక్ దర్ వెల్లడించారు. ఆ మేరకు ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు ఇరుదేశాలూ అంగీకరించాయి.
……………………………………………………..