తెలంగాణ ఎన్పీడీసీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు..
6,273 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదు!!
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSNPDCL) పరిధిలో విద్యుత్ వినియోగం ఆల్ టైమ్ హై రికార్డును సృష్టించింది. సోమవారం (మార్చి 2, 2026) నాడు సంస్థ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 6,273 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైందని సంస్థ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (CMD) కర్నాటి వరుణ్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, యాసంగి సాగు పనులు ముమ్మరం కావడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. నిన్న (ఆదివారం) నమోదైన 6,267 మెగావాట్ల రికార్డును అధిగమిస్తూ, కేవలం 24 గంటల వ్యవధిలోనే డిమాండ్ మరో 6 మెగావాట్లు పెరిగి 6,273 మెగావాట్లకు చేరుకోవడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వినియోగం గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ముందస్తు ప్రణాళికలతో నిరంతర సరఫరా:
రికార్డు స్థాయిలో డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, వినియోగదారులకు మరియు రైతులకు ఎటువంటి అంతరాయం కలగకుండా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని సీఎండీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యాంశాలను వెల్లడించారు. రాబోయే ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిని ఎదుర్కోవడానికి సంస్థ ఇప్పటికే పూర్తిస్థాయి కార్యాచరణను సిద్ధం చేసింది. సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద సాంకేతిక లోపాలు తలెత్తకుండా క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సాగు నీటి అవసరాల దృష్ట్యా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూనే, గృహ, పారిశ్రామిక అవసరాలకు ఎక్కడా కోతలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ జిల్లాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్లు ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.
